కమ్మనైన సర్వపిండి
04-05-2026 12:58 AM
తెల్లటి బియ్యప్పిండి పట్టించి
నూలుపప్పు పల్లీలు మిరపకాయలు
ఎక్కడేం లేకుంటే ఇంత ఉప్పు కారం ఎల్లిగడ్డ
ఏసేటియి అన్నీయేసి నీళ్లతో కలగలిపి
నాలుగు వేళ్లతో గుంజుకు అద్దిన ముద్దలో
సుతారంగా వేలితో గుంత చేసి
చుక్కెడు నూనె బొట్టు పోసి
పొయ్యి మీద కాలుతుంటే
బాల్యం తిరిగొచ్చి పొయ్యికాడ వాలుతుంది !
కరకరలాడే కబాబ్ కంటే
నోరూరించే పిజ్జా కంటే
ఏమాత్రం తక్కువ కాదీ వంటకం !
నంజుకుని తింటే కమ్మగ
అద్దుకొని తింటే మస్తుగ
పొద్దున నాష్టాకైనా.. సాయంత్రం స్నాక్స్‌కైనా
బుద్ధిపుడితే చిరుతిండికైనా
ఏక్ నంబర్ వంటకం
అదే.. సర్వపిండి పదార్థం
బలవర్ధకం.. అచ్చమైన తెలంగాణ వంటకం !!
బొల్లం బాలకృష్ణ






