18 August, 2026 | 3:26 AM

జేఎస్‌ఎస్సీ పరీక్షలు రద్దు

18-08-2026 12:08 AM
  1. విద్యార్థుల దీక్షకు దిగొచ్చిన జార్ఖండ్ ప్రభుత్వం
  2. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం: ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్

రాంచీ, ఆగస్టు 17: పోటీ పరీక్షల రద్దు కోసం రాంచీలో విద్యార్థులు చేపడుతున్న ఉద్యమానికి అక్కడి ప్రభుత్వం దిగివచ్చింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ (జేఎస్‌ఎస్సీ) సీజీఎల్ పరీక్షలను రద్దు చూస్తూ సోమవారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ౨౦౧౪ నుంచి ఔట్ సోర్సింగ్ సంస్థ టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలు, వాటి ఫలితాలనూ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే, జేఎస్‌ఎస్సీ పరిధిలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పరీక్షల అక్రమాలను ప్రశ్నిస్తూ, వాటిపై సీబీఐ విచారణ కోరుతూ 24 రోజులుగా రాంచీలో విద్యార్థులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో, సీఎం వారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు. పేపర్ లీకేజీలు, మోసాలను అరికట్టేందుకు త్వరలోనే కఠిన చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ నియామకాల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, పారదర్శకతను తీసుకువస్తామని తెలిపారు.

విద్యార్థులతో వెళ్లి స్వయంగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోవాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ లేఖ రాసిన కొద్ది గంటల్లోనే సీఎం హేమంత్ సోరెన్ స్పందించడం గమనార్హం. మరోవైపు, పరీక్షల అక్రమాలపై సీఐడీ ముమ్మర విచారణ జరుపుతున్నది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ విడిగా విచారణ చేపడుతున్నది. పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే ఆయా బృందాలు ఆధారాలు సేకరించాయి.