ట్రాఫిక్ పోలీసుల... ఆరోగ్య భద్రతే ముఖ్యం: ట్రాఫిక్ ఏసిపి సుబ్బయ్య
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజా వ్యవస్థలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర కీలకమని విధి నిర్వహణలో సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వారి భద్రత కోసం కృషి చేస్తున్నామని ట్రాఫిక్ ఏసిపి సుబ్బయ్య అన్నారు. ట్రాఫిక్ డిసిపి రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రెటినోవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకర హాస్పటల్ సహకారంతో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ సమక్షంలో ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ ఆధునిక కాలంలో రకరకాల రోగాలు ప్రజలను వెంటాడుతున్నాయని పోలీసులు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం కలిగేందుకు యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు యోగ వైపు పయనిస్తుందని, యోగాభ్యాసంతోనే సర్వ రోగాలను నయం చేసుకోవచ్చు అన్నారు. భారత ప్రభుత్వం యోగ విద్యకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. 50 మంది పోలీసులకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.






