సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు
జిఎంఆర్ వరలక్ష్మి సెంటర్ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు
కొత్తగూడెం,(విజయ క్రాంతి): సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జి.ఎం.ఆర్ వరలక్ష్మి సెంటర్ ఫర్ ఎంపవర్‌మెంట్ ద్వారా, నిర్వహించిన వృత్తి విద్యా శిక్షణా కార్యక్రమాలలో శిక్షణ పొంది ,శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని సింధురి మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ సంస్థలో నెలకు రూ.28 వేల జీతంతో ఉద్యోగాలు పొందిన టి. వంశీకృష్ణ మరియు బి. కార్తీక్ అనే యువకులకు కొత్తగూడెం ఏరియా జి.ఎం ఎం. శాలేం రాజు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జి.ఎం మాట్లాడుతూ, వృత్తి విద్యా కోర్సులు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. శిక్షణ కొరకు నమోదు చేసుకున్న అభ్యర్థులను సింగరేణి సంస్థ తమ స్వంత ఖర్చులతో శిక్షణ కేంద్రాలకు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. జి.ఎం.ఆర్ వరలక్ష్మి సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలలో డ్రైవాల్ & ఫాల్స్ సీలింగ్, వెల్డింగ్ & ఫ్యాబ్రికేషన్, ఆటోమొబైల్ & టూ వీలర్, హోటల్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్, ఆర్‌ఏసీ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ తదితర కోర్సుల్లో, శిక్షణ అందించబడినట్లు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమాలలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం, స్పోకెన్ ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ మరియు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కూడా అందించబడిందని తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ఇండస్ట్రీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనలో సహకారం అందించబడినట్లు పేర్కొన్నారు. ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందిన పలువురు యువత ఇప్పటికే ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం ఆనందదాయకమని తెలిపారు.
యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉపాధి ప్రధాన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి యువతకు తోడ్పాటు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన యువకులు తమకు శిక్షణతో పాటు అన్ని విధాల సహకారం అందించిన సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.






