18 July, 2026 | 12:18 AM

అందమైన జంట మధ్యకు సైకో అమ్మాయి వస్తే?!

17-07-2026 11:20 PM

సినిమా పేరు: వదలా 

తారాగణం: జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్ తదితరులు

దర్శకత్వం: ఆకెళ్ల వీ కృష్ణ 

సంగీతం: కార్తిక్ బీ కొడకండ్ల

నిర్మాతలు: కిషోర్ నాయుడు చిరు మామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్

డీవోపీ: చోటా కే నాయుడు 

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు

విడుదల తేదీ: జూలై 17, 2026

జగపతిబాబు, లయ సుమారు రెండు దశాబ్దాల తర్వాత జంటగా నటించిన చిత్రం ‘వదలా’. ఈ చిత్రానికి ఆకెళ్ల వీ కృష్ణ దర్శకత్వం వహించారు. చరిత చిత్ర బ్యానర్‌పై కిషోర్ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. శుక్రవారం థియేటర్లలో అడుగుపెట్టిన సైకలాజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

యోగి సిద్ధార్థ్ (జగపతిబాబు) మధ్యప్రదేశ్‌లో ఓ డాక్టర్. అతని భార్య ప్రియ (లయ). వారి పిల్లలుతో ఒక అందమైన ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తాడు. అయితే ఓ యాక్సిడెంట్ ద్వారా పరిచయమైన అమ్మాయి అముద (హృతిక శ్రీనివాస్) యోగి జీవితంలోకి వస్తుంది. అక్కడ నుంచి వారి జీవితంలో ఆమె కారణంగా ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అసలు ఈ అముద ఎవరు? ఎందుకు వీరి జీవితంలోకి వచ్చింది? ఆమెకు నివాస్ (శ్రీనివాస్ అవసరాల)కు సంబంధమేంటి? అనేది మిగతా కథ. 

ఇది ఒక అందమైన కుటుంబం కథ. డాక్టర్ యోగి సిద్ధార్థ్ జీవితంలోకి ప్రవేశించిన అముద అనే సైకో యువతి, అతని కుటుంబంలో సృష్టించిన కలకలం చుట్టూ ఈ కథ నడుస్తుంది. 20 ఏళ్ల అన్యోన్య దాంపత్య జీవితాన్ని తన వ్యామోహంతో అముద ఎలా ఛిద్రం చేసిందనేది ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రధానాంశం. అముద ప్లాన్స్ వల్ల ఎదురైన పరిణామాలను సిద్ధార్థ్ ఎలా అధిగమించాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

ఇక ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే.. జగపతిబాబు, లయ జోడి, హృతిక శ్రీనివాస్ యాక్టింగ్ అనే చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై కలిసి కనిపించిన ఈ సీనియర్ నటుల కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలం. కుటుంబ బాధ్యతలు మోసే వ్యక్తిగా జగపతిబాబు, గృహిణిగా లయ తమ నటనతో మెప్పించారు. అమాయకంగా కనిపిస్తూనే, లోపల తీవ్రమైన సైకో మనస్తత్వం ఉన్న నెగెటివ్ షేడ్స్ పాత్రలో హృతిక శ్రీనివాస్ నటన సినిమాను మలుపు తిప్పుతుంది. ఇక స్క్రీన్‌ప్లే ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రథమార్ధం ఫ్యామిలీ డ్రామాగా సాగుతూ, ద్వితీయార్ధంలో వచ్చే సస్పెన్స్, సైకలాజికల్ అంశాలు ప్రేక్షకులను సీట్లకు హత్తుకునేలా చేస్తాయి. 

లక్ష్మీభూపాల రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కుటుంబ విలువల మధ్య వచ్చే భావోద్వేగాల గురించి సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి. సీనియర్ కెమెరామెన్ చోటా కే నాయుడు అందించిన విజువల్స్ చాలా రిచ్‌గా ఉంటూ, సస్పెన్స్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. కార్తీక్ బీ కొడకండ్ల అందించిన ఈ సంగీతం, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టెన్షన్‌ను పెంచుతుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ షార్ఫ్‌గా ఉంది. ఇది కేవలం రొటీన్ హారర్ లేదా థ్రిల్లర్ కాకుండా, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్. సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా. మంచి నటనను ఇష్టపడే ప్రేక్షకులు చూడదగ్గ చిత్రం.