ఆరుతడి పంటల సాగు మేలు
హాజీపూర్, జూలై 17 : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు సాగు చేయడం మేలని మండల వ్యవసాయాధికారి క్రిష్ణ సూచించారు. శుక్ర వారం మండలంలోని నర్సింగాపూర్ లో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్)లో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రైతులనుద్దేశించిన ఆయన మాట్లాడారు. ఆరుతడి పంటలైన పప్పుదినుసులు, కూరగాయలు, మెట్ట పంటలైన జొన్న తదితర పంటలు సాగు చేయాలన్నారు.
వరి పంటకి వినియోగించే ఎకరం నీటితో ఇతరపంటలు రెండు నుంచి మూడు ఎకరాలు సాగు చేసుకోవచ్చన్నారు. అలాగే సహజ వ్యవసాయం పశుపోషణతో అనుసంధానమై ఉంటుందని, ఇందులో బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి వంటివి పొలంలోనే తయారు చేసుకోవచ్చన్నారు. బహుళ పంటల సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధుప, కృషి, సఖి, స్వప్న, సేంద్రీయ వ్యవసాయ రైతులు గడ్డం రవీందర్ రెడ్డి, గంగా రెడ్డి, వెంకట్ రెడ్డి ఇతర రైతులు పాల్గొన్నారు.






