21-02-2026 12:00:00 AM
డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
ముషీరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మాతృభాషను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని, భాష జీవిస్తేనే సంస్కృతి నిలుస్తుందని, సంస్కృతి నిలిస్తే సమాజ ఐక్యత బలపడుతుందని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం రవీంద్రభారతి మినీ హాల్లో భాషా సాంస్కృతిక శాఖ, జాతీయ తెలుగు సారస్వత పరిషత్, ఆదిదీలా ఫౌండేషన్, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభకవి సమ్మేళనంలో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష మన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక విలువలకు పునాది అని, భాషను పరిరక్షించడం ద్వారా సమాజ చారిత్రిక వారసత్వం భవిష్యత్ తరాలకు అందేలా చేయవచ్చని ఆయన సూచించారు. సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలాచారి, ప్రముఖ కవి రామకృష్ణ చంద్రమౌళి మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ కేశిరాజు రామ్ ప్రసాద్, డాక్టర్ ఎస్. ఆదినారాయణ సమన్వయకర్తగా, బడే సాబ్ ప్రధాన నిర్వాహకుడిగా వ్యహరించారు. కవి సమ్మెలనం నిర్వహణ డాక్టర్ రాధాకృష్ణ సాహితీవేత్తలు శ్రీమతి చెబ్రోలు శశిబాల, శ్రీ కృష్ణ చంద్రవల్లి, ప్రముఖ కవి డాక్టర్ ఆదినారాయణ, ఆదిదీలా ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎ.వి.ఆర్. మూర్తి, జాతీయ తెలుగు సారస్వత పరిషత్ జాయింట్ సెక్రటరీ పాలడుగు సరోజినీదేవి,
మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ (విరమణ) గంట మనోహర్ రెడ్డి, ప్రముఖ , డాక్టర్ అర్ధ చంద్రప్రకాశ్ రెడ్డి, గోల్కొండ సాహిత్య కళా సమితి అధ్యక్షులు, లక్ష్యసాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞారాజు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గజవెల్లి సత్యనారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.