బ్యాంకు స్కాముల్లో అంతర్గత వ్యవస్థ!
- అర్ధరాత్రి అరెస్టుతో వెలుగులోకి
- వేళ్లూనుకుంటున్న బ్యాంకు ఉద్యోగుల స్కాంలు
- సంఖ్య తగ్గుతున్నా.. విలువ పెరుగుతున్న వైనం
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): అర్ధరాత్రి దాటిపోయింది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న ఆశ్రమ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. మధ్య భారతదేశంలోని చీకటి మైదానాలను చీల్చుకుంటూ దూసుకుపోతోంది. ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలో ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. అదే సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన నలుగురు అధికారులు రైలు బోగీల్లో నిశ్శబ్దంగా వెతుకుతున్నారు.
దాదాపు గంటపాటు సాగిన ఆ వెతుకులాటలో రూ. 16 కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పు ఏళ్ల వయసులో ఉన్న ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారిని పట్టుకున్నారు. వృద్ధ ఖాతాదారుల ఫిక్స్‌డ్ డిపాజిట్లను అక్రమంగా బదిలీచేసుకుని, ముంబైలోని ఓ బ్యాంకు శాఖను మూడేళ్లపాటు పద్ధతి ప్రకారం దోచుకున్నాడన్నది అతనిపై ఆరోపణ. దర్యాప్తు అధికారులు తనకు దగ్గరపడుతున్నారని గ్రహించిన వెంటనే అతడు అదృశ్యమయ్యాడు.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇంటిని విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మొబైల్ ఫోన్ ఆధారంగా అతడి జాడ తెలుసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రత్యక్ష నిఘా కూడా ఫలించలేదు. చివరకు అతడు ప్రయాణిస్తున్న రైలు గురించిన సమాచారం అధికారులకు చిక్కింది. మోసానికి పాల్పడ్డ బ్యాంకు అధికారి బుక్ చేసుకున్న బెర్త్ వద్దకు ఈడీ అధికారులు చేరుకునేసరికి బెర్త్ ఖాళీగా కనిపించింది.
అటెండెంట్‌ను ప్రశ్నించగా.. ఆ సాయంత్రం రైలు ఎక్కిన తర్వాత కొందరు ప్రయాణికులు తమ బెర్త్‌ను మార్చుకున్నారని తెలిపాడు. అధికారులు కొత్త సీటింగ్ వివరాలను తెలుసుకుని బోగీల్లో వెతుకుతూ చివరకు తమ లక్ష్యాన్ని గుర్తించారు. మరో బెర్త్‌లో ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. తెల్లవారుజామున మంచు తెరల మధ్య రైలు ముందుకు సాగుతుండగా జరిగిన ఆ అరెస్టుతో ఒక నాటకీయ వేట ముగిసింది.
అయితే, అనేక కోణాల్లో చూస్తే ఇది చాలా సాధారణమైన బ్యాంకు మోసం కథే. ఆ అధికారిని మనం ‘వివేక్’ అని పిలుద్దాం. దేశంలోనే అత్యంత పోటీ ఉండే నియామక పరీక్షల్లో ఒకదాన్ని అధిగమించి, లక్షలాది మంది అభ్యర్థులను వెనక్కి నెట్టి, ఇరవైల్లోనే అతడు ఓ పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగిగా చేరాడు.
శిక్షణ పూర్తయ్యాక బ్యాంకింగ్ కార్యకలాపాల్లోని వివిధ విభాగాల్లో అనుభవం సంపాదించాడు. అనంతరం ముంబైలోని రద్దీగా ఉండే ఓ శాఖలో అధికారిగా పోస్టింగు పొందాడు. అక్కడ అందరితోనూ కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. సహోద్యోగులు అతడి పనితీరును మెచ్చుకునేవారు. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టడానికి లేదా నగదు తీసుకోవడానికి వచ్చే వృద్ధ ఖాతాదారులు అతడిని సహజంగానే నమ్మేవారు.
శాఖలో రోజువారీ కార్యకలాపాలు
శాఖలో రోజువారీ కార్యకలాపాల కోసం మేనేజర్ కూడా అతడిపైనే ఆధారపడటం మొదలుపెట్టారు. ఆ శాఖ మేనేజర్ తన సిస్టమ్ లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌ను వివేక్‌తో పంచుకున్నారు. దీంతో బ్యాంకు సాంకేతిక వ్యవస్థకు వెన్నెముకలాంటి కేంద్రీకృత కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ లో అత్యున్నత స్థాయి యాక్సెస్ అతడికి లభించింది.
దేశవ్యాప్తంగా శాఖలు, ఏటీఎంలు, డిజిటల్ ప్లాట్‌ఫాముల్లో డిపాజిట్లు, నగదు ఉపసంహరణలు, రుణాల ప్రాసెసింగ్ వంటి కార్యకలాపాలను రియల్ టైంలో నిర్వహించే వ్యవస్థ ఇదే. రోజువారీ పనుల ఒత్తిడిలో, ఎండ్-ఆఫ్-డే రిపోర్టులు సమయానికి సమర్పించాలనే ఉద్దేశంతోనే మేనేజర్ తన లాగిన్ వివరాలను అతడితో పంచుకున్నారు. రూ. 16 కోట్ల భారీ దోపిడీకి అదే మార్గంగా మారుతుందని మేనేజర్ ఊహించలేదు.
అలవోకగా మోసం
భారతీయ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఏడాది నుంచి రెండేళ్లపాటు ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను ‘ఇన్‌ఆపరేటివ్’గా, రెండేళ్లకు మించి లావాదేవీలు లేని ఖాతాలను ‘డార్మెంట్’గా వర్గీకరిస్తారు. ఇలాంటి ఖాతాలు సాధారణంగా అంతర్గత ఆడిటర్ల పరిశీలనకు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. వివేక్ తన శాఖలోని డార్మెంట్ ఖాతాల నుంచి ఇతర బ్యాంకులకు నిధులను బదిలీ చేయడం ప్రారంభించాడు.
వృద్ధులు, నమ్మకమైన ఖాతాదారులకు చెందిన టర్మ్ డిపాజిట్ రసీదులను తన ఆధీనంలోకి తీసుకుని, వాటిని గడువు ముగియకముందే రద్దు చేసి, ఆ మొత్తాన్ని ఇతర బ్యాంకుల్లో తన పేరుతో ఉన్న ఖాతాలకు మళ్లించాడు. అంతేకాదు, తన శాఖలోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), స్మాల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాలనూ లక్ష్యంగా చేసుకున్నాడు.
తన పాస్‌వర్డ్‌తోపాటు బ్యాంకు శాఖ మేనేజర్ పాస్‌వర్డ్ కూడా అతడి చేతిలో ఉండటంతో.. ‘మేకర్-చెకర్’ భద్రతా వ్యవస్థను వివేక్ నిర్వీర్యం చేశాడు. ఒక పాస్‌వర్డ్‌తో లావాదేవీని ప్రారంభించి, మరో పాస్‌వర్డ్‌తో దానిని ఆమోదించేవాడు. బ్యాంకింగ్ వ్యవస్థలోని కీలక అంతర్గత భద్రతా వ్యవస్థను ఇలా చేధించేవాడు.
ఇది ఒక్క వివేక్ కథ మాత్రమే కాదు
ఏళ్లుగా భారత్ జామ్తారా తరహా డిజిటల్ మోసాలు, అధునాతన ఫిషింగ్, సిమ్-స్వాప్ దాడులు, వాట్సాప్ మోసాలతో పోరాడుతోంది. తాజాగా.. బలంగా.. తలెత్తుతున్న కొత్త ముప్పు పాస్‌వర్డ్ చేతిలో ఉన్న ఇంటి దొంగ.. అదే బ్యాంకు ఉద్యోగి రూపంలో కనపడుతున్నారు.
ఇలాంటి మోసాలకు పాల్పడే బ్యాంకు ఉద్యోగుల సంఖ్యపై అధికారిక సమాచారం లేదు. అయితే సీనియర్ బ్యాంకర్ల అంచనా ప్రకారం బ్యాంకుల వార్షిక నియామకాల్లో సుమారు ఒక శాతం మంది ఇలాంటి వర్గంలో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా వీరు ముప్పు సంవత్సరాల వయసులో ఉంటారు. బ్యాంకింగ్ కార్యకలాపాలపై మంచి పట్టు ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటుంది. పైకి సత్ప్రవర్తన కలిగినవారిలా కనిపిస్తారు. సెలవులు తీసుకోకుండా నిరంతరం పనిచేసే ‘వర్క్‌హాలిక్’ ఉద్యోగులుగా పేరు తెచ్చుకుంటారు.
బ్యాంకింగ్ రంగంలో మోసాలను ప్రధానంగా రెండు విభాగాలుగా చూడవచ్చు.. క్రెడిట్ మోసాలు, ఆపరేషనల్ మోసాలు. క్రెడిట్ మోసాల్లో రుణాల మంజూరులో అక్రమాలు, అధిక రుణాలు పొందేందుకు తాకట్టు విలువలను పెంచి చూపడం. వర్కింగ్ క్యాపిటల్ నిధులను దారి మళ్లించడం వంటి చర్యలు ఉంటాయి. వీటిని గుర్తించడం సాధారణంగా కొంత సమయం పడుతుంది.
ఆపరేషనల్ మోసాల స్వభావం మాత్రం భిన్నం. ఇవి బ్యాంకు బ్యాలెన్స్ షీట్లలోని లయబిలిటీ అంశానికి సంబంధించినవి. కొన్ని సంఘటనల్లో స్కాం జరిగిన మొత్తం తక్కువగా ఉండవచ్చు. ఇరవై వయస్సులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చేరే అధికారులు సాధారణంగా ఐదు నుంచి పదేళ్లపాటు శాఖ కార్యకలాపాలపై పూర్తి అవగాహన పెంచుకుంటారు. లావాదేవీల ప్రవాహం, డార్మెంట్ ఖాతాల విధానాలు, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ నిర్మాణం, ఆడిట్ చక్రాలు .. ఇలా అన్నింటినీ తెలుసుకుంటారు. ముప్పులోకి వచ్చేసరికి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మాత్రమే కాదు, ఆ వ్యవస్థలోని బలహీనతలు ఎక్కడున్నాయో కూడా వారికి తెలిసిపోతుంది.
2025 సెప్టెంబరులో వెలుగుచూసిన అల్వార్ కేసు దీనికి మరో ఉదాహరణ. అక్కడ ఓ పెద్ద ప్రైవేట్ బ్యాంకుకు చెందిన దాదాపు అరడజను మంది ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు నకిలీ ఖాతాలను తెరవడానికి తమకు ఉన్న ప్రత్యేక సిస్టమ్ యాక్సెస్‌ను ఉపయోగించి, సుమారు 500 కోట్ల మ్యూల్ అకౌంట్’ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు అక్రమంగా డబ్బును తరలించారు.
ప్రతి లావాదేవీకి మేకర్ సిస్టంలో సందేశాన్ని ప్రారంభిస్తాడు. చెకర్ దానిని పరిశీలించి ఆమోదిస్తాడు. ఆ తర్వాత మూడో దశలో వెరిఫయ్యర్ లావాదేవీ నిజమైనదేనని నిర్ధారించిన తర్వాతే అది అమలవుతుంది. అయితే వివేక్ పనిచేసిన శాఖలో బ్యాంకు అంతర్గత నియంత్రణ వ్యవస్థకు కీలకమైన ఈ ‘మేకర్-చెకర్’ విధానం పూర్తిగా నిర్వీర్యమైంది.
ఒక్కరోజు కూడా సెలవు పెట్ట్టలేదు
ఏళ్ల తరబడి అదే శాఖలో పనిచేసిన వివేక్ ఒక్కరోజు కూడా సెలవు పెట్టేవాడు కాదు. అది మొదట్లో అతడి కష్టపడే స్వభావానికి నిదర్శనంగా కనిపించింది. కానీ వాస్తవానికి అది ఒక హెచ్చరిక సంకేతం. ఎందుకంటే తాను లేని సమయంలో మరొక అధికారి తన డెస్క్ లేదా సిస్టంను పరిశీలిస్తే దాచిపెట్టిన వ్యవహారం బయటపడే ప్రమాదం ఉంది. చివరకు కుటుంబంలో అత్యవసర పరిస్థితి ఏర్పడటంతో అతడు తప్పనిసరిగా సెలవు తీసుకోవాల్సి వచ్చింది.
తండ్రి ఆరోగ్యం విషమించడంతో హుటాహుటిన స్వగ్రామానికి వెళ్లాడు. అతడి స్థానంలో విధులు చేపట్టిన సహోద్యోగి డెస్క్‌లోని ఫైళ్లను పరిశీలిస్తుండగా డార్మెంట్ ఖాతాల్లో అసాధారణ ఎంట్రీలు కనిపించాయి. లావాదేవీలను వెనక్కి అనుసరించగా, డబ్బు ఇతర బ్యాంకుల్లోని ఖాతాలకు వెళ్లినట్లు తేలింది. ఫోరెన్సిక్ పరిశీలనలో మూడేళ్లుగా అంతర్గత, బాహ్య ఆడిట్‌కు చిక్కకుండా శాఖ నుంచి రూ. 16 కోట్లు బయటకు వెళ్లినట్లు నిర్ధారణ అయింది.
దర్యాప్తు ప్రారంభమైనప్పుడు వివేక్ అనారోగ్యంతో ఉన్న తన తండ్రి పక్కన లేడు. మొబైల్ ఫోన్‌ను ఆఫ్ చేసి.. విమానాల నుంచి ఆటోరిక్షాల వరకు ప్రయాణ మార్గాలను మార్చుకుంటూ అధికారులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు ఆ రాత్రి రైలులో అరెస్టయ్యాడు. కస్టడీలో అతడు మొత్తం డబ్బును పోగొట్టుకున్నట్లు అంగీకరించాడు. ఆ సొమ్మును స్టాక్ మార్కెట్లోనో, స్థిరాస్తుల్లోనో, బంగారంలోనో పెట్టుబడి పెట్టలేదు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో పెట్టి మొత్తం కోల్పోయాడు.
రూ.36,014 కోట్ల మోసాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024--25 వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకు మోసాల మొత్తం విలువ రూ. 36,014 కోట్లకు పెరిగింది. అనంతరం సవరించిన గణాంకాల ప్రకారం అది రూ. 32,803 కోట్లుగా నమోదైంది. ఇది 2023--24లో నమోదైన మొత్తం మోసాల విలువతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు. అదే సమయంలో నమోదైన మోసం కేసుల సంఖ్య 36,060 నుంచి సవరించిన గణాంకాల ప్రకారం 23,722కు తగ్గింది.
ఇక్కడ మనకు విరుద్ధ ధోరణి ఒకటి మనకు కనపడుతుంది. 2025--26 గణాంకాలు కూడా ఇదే ఆందోళనను బలపరుస్తున్నాయి. మొత్తం మోసాల విలువ రూ. 48,021 కోట్లకు పెరిగింది. అయితే నమోదైన కేసుల సంఖ్య 10,114కు తగ్గింది. మొత్తం మోసం విలువలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం గమనార్హం.
తమల్ బంద్యోపాధ్యాయ్, బ్యాంకర్స్ ట్రస్ట్






