21 ఏళ్లకే చట్టసభలకు
- అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపుతాం
- 58 ఇంచుల ఛాతీని జెన్ జీ ఓడించింది..
- విద్యా శాఖ, ఐటీ శాఖల మంత్రులుగా జెన్ జీలే ఉండాలి
- క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): చట్ట సభలకు పోటీ చేసే వయసు 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు మొదటివారంలో అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ఎమ్మె ల్యే, ఎంపీగా పోటీచేసే వయసు 21ఏళ్లుగా ఉండాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని ప్రకటించారు. జంతర్ నుంచే జెన్ జీ పార్లమెంట్‌కు వెళ్లాలని, 58 ఇంచుల ఛాతీని ఓడించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి తో రాజీనామా చేయించారని రేంత్‌రెడ్డి అన్నారు.
ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోదల్చుకోలే దని స్పష్టం చేశారు. విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రులుగా జెన్‌జీలే ఉండాలని, ఈ సునామీ ఇంతటితో ఆగవద్దని సీఎం రేవంత్ పేర్కొ న్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌లకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జంతర్ మంతర్ నుంచి జెన్ జీ పార్లమెంటుకు వెళ్లాలని ఆకాంక్షించారు. రాజీవ్‌గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు 21 యేళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించా రని తెలిపారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు రావడం వెనుక రాజీవ్‌గాంధీ ఉన్నారని గుర్తు చేశారు.
స్థానిక సంస్థలు, శాసన సభ, లోక్ సభలు ప్రధానమైన చట్ట సభలని, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి స్థానిక సంస్థల్లో పోటీ చేయ డానికి 21 ఏళ్లకు తగ్గించారని చెప్పారు. 21 యేళ్లకు ఒక సోదరిమణి త్రివేండ్రం మేయర్ అయ్యారని, సివిల్ సర్వీస్‌కు అర్హత 21 ఏళ్లు మాత్రమే అని తెలిపారు. 21 ఏళ్లకు మన తెలుగమ్మాయి శ్రీలక్ష్మి ఐఏఎస్ సాధించిందని, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య 22 ఏళ్లకు ఐఏఎస్ సాధించిందని, 32 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ సాధించారని వెల్లడించారు.
అసెంబ్లీకి పోటీ చేయడానికి మన దేశంలో 25 ఏళ్లు, రాజ్యసభకు 30 ఏళ్ల అర్హత పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్లకే పోటీ చేసే హక్కు కల్పించారని, సింగపూర్‌లో 21ఏళ్ల కే పోటీ చేసి, ప్రధాన మంత్రి కావొచ్చని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో చేసి పంపే తీర్మానం పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే నాయకత్వంలో ఈ బిల్లును ఆమోదిం చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మా ఖాతాలో వేసుకోదల్చుకోలేదు..
యువ మిత్రులు, జెన్ జీ అన్నదమ్ముళ్ల మొఖాల్లో విజయ దరహాసం ‘నాకు కనిపిస్తోంది’ అని, కానీ ఇది సరిపోదన్నారు. జన్ జీ యువత 58 ఇంచుల ఛాతీని ఓడించి విద్యా శాఖ మంత్రి రాజీనామా వరకు తెచ్చారని అభినందించారు. నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో ఆత్మహ త్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని, పోరాటంలో విద్యార్థులపైన పెట్టిన కేసులను ఎత్తివేయలేద న్నారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షా నిర్వహణలో విఫలం కావడం వల్ల అనేక మంది విద్యార్థుల నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాహుల్ గాంధీ, మల్లికార్జున్‌ఖర్గే, ఎంపీలు సభలో మరింత ఎక్కువ గళం ఎత్తుతారని తెలిపారు. విద్యార్థులపైన పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్, ఇందిరమ్మ సాక్షిగా వేలాది మంది జన్‌జీ యువత ఇక్కడికి తరలివచ్చారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన వారంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కాదని చెప్పారు.
భారతదేశ యువత సాధించిన విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదల్చుకోలేదని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జన్‌జీ పోరాట ఫలితమని స్పష్టం చేశారు. పోరాటానికి ప్రధాని మోదీ తలవంచి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారని, ఈ విజయం మీదని ప్రశంసించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపెట్టుకోకుండా అక్రమ కేసులను తొలగించడానికి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు సాయం కోసం ఈ ర్యాలీ చేపట్టామని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, మోదీ వైఫల్యాల పైన పోరాడుతామని వేలాది మంది అంబేద్కర్ సాక్షిగా వచ్చారని తెలిపారు. ప్రజాస్వామిక వాదులంతా దిక్కులు పిక్కటిల్లేలా యువతకు మద్దతు ఇచ్చారని ప్రశంసించారు. జన్ జీ యువత విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రులుగా ఉంటే దేశం ముందుకు పోతుందని ఆకాంక్షించారు. కేంద్రంలో కూడా విద్యా మంత్రిగా జన్ జీ కి అవకాశం కల్పించడానికి తాను రాహుల్ గాంధీ, ఇండియా కూటమితో మాట్లాడుతానని స్పష్టం చేశారు.
ప్రపంచానికి జన్ జీ గళం వినిపించాలని, ఆ దిశగా మేం పనిచేస్తామన్నారు. పార్లమెంటులో ఒక్క శాతం లోపే జన్ జీ ప్రాతినిధ్యం ఉందని, ముప్పు శాతం ఉన్న జెన్ జీలకు చట్టసభల్లో అవకాశం కల్పించాల్సి ఉందన్నారు. మోదీని, కేంద్రాన్ని గుండె ధైర్యంతో ఎదిరించారని, లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారని అభినందించారు. ఈ సునామీ ఇంతటితో ఆగవద్దని పిలుపునిచ్చారు.
మార్పు తెలంగాణ నుంచే: పీసీసీ చీఫ్
విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. కేంద్రం మెడలు వంచనందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చరిష్మా తగ్గిందన్నారు. మోదీ చర్యలను ప్రపంపం ఖండించిందని విమర్శించారు. జెన్ జీ యువతకు చట్ట సభల్లో ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. 21 ఏళ్లకే చట్ట సభల్లో అవకాశం కల్పించేలా చట్టం తీసుకురావాలని, ఈ మార్పును తెలంగాణ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.






