కుర్ర‘కారు’ టార్గెట్!
యూత్‌ను ఆకర్షించేలా బీఆర్‌ఎస్ వ్యూహం
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బీఆర్‌ఎస్ తెరతీస్తోంది. రైతు ఉద్యమా లతో పార్టీకి ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూనే, ఇప్పుడు యువతను కూడా రాజకీయంగా ప్రధాన అజెండాగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగాలు, నిరుద్యో గం, పరీక్షల నిర్వహణ, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు, స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై యువతలో పెరుగుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా బస్ యాత్ర చేపట్టాలనుకోవడం, కేటీఆర్ పాదయాత్ర ద్వారా యువతతో ప్రత్యక్షంగా మమేకం కావడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువతకు ప్రాధాన్యమిచ్చే రాజకీయ వ్యూహంతో బీఆర్‌ఎస్ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల జెన్ జీ ఓటర్లే రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారనే అంచనాతో పార్టీ ప్రత్యేక కార్యాచ రణ రూపొందిస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
యువత ఆకాంక్షలను రాజకీయ చర్చలోకి తీసుకురావ డం ద్వారా వారిని పార్టీకి చేరువ చేయాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. మరోవై పు జెన్ జీ ఎక్కువగా సోషల్ మీడియా వేదికల ద్వారానే రాజకీయాలను అనుసరిస్తున్న నేపథ్యంలో, డిజిటల్ ప్రచా రం, యువతతో ఇంటరాక్టివ్ కార్యక్రమాలు, సోషల్ మీడియా క్యాంపెయి న్లపై కూడా బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి పెడుతుంది. రైతులతో పాటు యువతను కూడా పార్టీ ప్రధాన బలంగా మార్చుకోవాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
యువతకు ఇచ్చిన హామీలు, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, పోటీ పరీక్షల నిర్వహణ, ఉన్నత విద్యలో అవకాశాల విస్తరణ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రత్యేకంగా ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు, ఉన్నత విద్య పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. విద్యార్థి సంఘాలు, యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు, ప్రజా కార్యక్రమాల ద్వారా ఈ అంశాన్ని నిరంతరం ప్రజల్లో ఉంచాలని పార్టీ కార్యాచరణ రూపొంది స్తున్నట్లు సమాచారం.
రాబోయే అసెం బ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్ ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గా ల్లో చర్చ జరుగుతోంది. బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలవడంతో పాటు, పాదయాత్ర ద్వారా కేటీఆర్ ముఖ్యంగా యువత, విద్యార్థులు, నిరుద్యోగులతో నేరుగా మమేక మయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నది.
ఒకే సమయంలో ఇద్దరు అగ్రనేత లు వేర్వేరు వర్గాలపై దృష్టి సారించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా మార్చడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవైపు కేసీఆర్ అనుభవాన్ని, మరోవైపు కేటీఆర్ యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తూ పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపడం, ప్రజల్లో బీఆర్‌ఎస్ మళ్లీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందనే సందేశాన్ని ఇవ్వడమే ఈ డబుల్ క్యాంపెయిన్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రబిందువుగా యువత..
దేశ రాజకీయాల్లో యువత పాత్ర గతంతో పోలిస్తే మరింత ప్రభావవంతంగా మారుతోంది. ముఖ్యంగా జెన్ జీ ఓటర్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ రాజకీయ చర్చలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారు. దీంతో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాల్లో యువతను కేంద్రబిందువుగా మార్చుకుంటున్నాయి.
గత కొన్నేళ్లుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షల అభ్యర్థులు ఉద్యోగాలు, పరీక్షల నిర్వహణ, విద్యా అవకాశాలు వంటి అంశాలపై నిర్వహించిన ఆందోళనలు రాజకీయ చర్చకు దారి తీశాయి. ఈ జాతీయ ధోరణిని దృష్టిలో పెట్టుకునే బీఆర్‌ఎస్ కూడా తెలంగాణలో యువతను ప్రధాన రాజకీయ అజెండాగా తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కొత్తగా ఓటర్లుగా చేరే యువత సంఖ్య గణనీయంగా ఉండటంతో, వారి మద్దతు సాధించగలిగిన పార్టీకే రాజకీయంగా ఆధిక్యం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉద్యమ రాజకీయాలకు పదును
తెలంగాణ ఉద్యమంతో రాజకీయంగా బలపడిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో మరోసారి ఉద్యమ రాజకీయాలకు పదును పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికార పార్టీపై కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ప్రజా సమస్యలపై ప్రత్యక్ష ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ వ్యూహ రచన చేస్తున్నది. ముఖ్యంగా రైతులతో పాటు యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ఉద్యమాల కేంద్రంగా మార్చి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఉద్యమాలతో రాజకీయంగా బలం సాధించాలనే లక్ష్యంగా కనిపిస్తోంది.






