26 July, 2026 | 1:54 AM

నేటితరం దారి తప్పలేదు

26-07-2026 12:48 AM
  1. కొత్త తరానికి జవాబు ఇవ్వాల్సిందే 
  2. యువత ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తోంది
  3. వారికి సమాధానంచెప్పాల్సిందే 
  4. కొత్త సాంకేతికతపై పట్టు సాధించాలి 
  5. పిల్లలతో తల్లిదండ్రులు మరింత ఆప్యాయంగా ఉండాలి 
  6. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

న్యూఢిల్లీ, జులై 25: నీట్ లీక్ నిరసనల మధ్య ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి తరం దారి తప్పలేదని, కొత్తతరం ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తోందని, జవాబు ఇవ్వాల్సిందేనని, యువతకు సమాధానం చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొత్తతరంతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడిపి, వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ఇప్పటి తరం మార్గదర్శకత్వం లేనిదో లేదా దారి తప్పినదో కాదని, వారిని అర్థం చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం కాకుండా అర్థవంతమైన చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఢిల్లీ వీధుల్లో విద్యార్థుల నిరసనల వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఢిల్లీలో శనివారం జరిగిన ‘విశ్వ మాంగల్య సభ’ జాతీయ ప్రబోధన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను, యువత ఆలోచనా విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేటి కాలంలో ప్రతీది మొబైల్లోనే నిక్షిప్తమై ఉందన్నారు. నేటి కుటుంబాల్లోనూ పరస్పర సంభాషణలు తగ్గిపోతున్నాయని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో మరింత ఆప్యాయంగా మెలగాలని, వారి కోసం సమయం కేటాయించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.

ప్రస్తుతం కొత్తతరం ప్రతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని, వారికి కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా తగిన కారణాలను వివరించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని అభిప్రాయపడ్డారు. ‘మేము యువకులుగా ఉన్నప్పుడు విధేయత చూపించే వాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నేటి తరం ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉంది. కాబట్టి మనం వారికి ప్రతి విషయాన్ని కారణాలతో సహా వివరించాల్సి ఉంటుందన్నారు. యువత నమ్మకాన్ని గెలవాలంటే హుకుం జారీ చేయడం కాదు, వారితో మాట్లాడాలి. వారికి ఓ ఆత్మీయ భావన కలిగించాలి. ఆదేశాలు జారీ చేయడం కాకుండా చర్చలు జరిపి, ఒక ఏకాభిప్రాయానికి రావడం ముఖ్యమని భగవత్ పిలుపునిచ్చారు.

కొత్త సాంకేతికతపై పట్టు సాధించాలి

విదేశీ దండయాత్రలు, బ్రిటీష్ పాలన వల్ల భారత ప్రజల ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. బ్రిటీష్ పాలన వల్ల మన సాంప్రదాయాలు తప్పని, విదేశీ పద్ధతులే సరైనవనే భావన భారతీయుల్లో పెరిగిందని వ్యాఖ్యానించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

టెక్నాలజీని మానవాళి శ్రేయస్సు కోసం వాడుకోవాలని సూచించారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల గురించి భగవత్ ప్రత్యక్షంగా ఎలాంటి ప్రస్తావన చేయకపోయినప్పటికీ, ప్ర స్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన వ్యాఖ్య లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘మోహన్ భగవత్ గారు, జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పరిణామాలపై మీరు పాటిస్తున్న మౌనం మీ స్పీచులకంటే శక్తివంతంగా ఉంది’ అని విమర్శించారు.