రాజకీయ కోణమే!
- యూఎస్ పర్యటనకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్ ఆరోపణ
- హైదరాబాద్ వచ్చాక అన్ని వివరాలు వెల్లడిస్తా
- లండన్ నుంచి సోషల్ మీడియాలో ట్వీట్
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి) : తన అమెరికా పర్యటనకు రాజకీయ కోణంలోనే కేంద్రం అనుమతి నిరాకరించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.అనుమతి ఇవ్వకపోవడంతో బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నానని వెల్లడించారు. లండన్‌లో తన పర్యటన విజయవంతమైందన్నారు. అక్కడ నిర్వహించిన అన్ని అధికారిక సమావేశాలు, షెడ్యూల్ కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. అపూర్వ మద్దతు లభించిందని, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కేంద్ర నిర్ణయాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఖండించిందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వ్యవహారంపై స్పందించారని, ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవడం సరికాదని తనకు మద్దతుగా నిలిచారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు.
తనకు అండగా నిలిచిన ఖర్గే, ఇతర రా జకీయ పార్టీలు, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విదేశాంగ శాఖ నిర్ణయం, దానికి వెనుక ఉన్న రాజకీయం, పర్యటన పూర్తి వివరాలను హైదరాబాద్ వచ్చాక వెల్లడిస్తానని తెలిపారు. బోస్టన్ పర్యటన రద్దు కావడంతో సీఎం రేవంత్ సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.






