కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కలెక్టర్‌కు ఏఐటీయూసీ వినతి
ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఏరియా హాస్పిటల్ కాగజ్‌నగర్‌తో పాటు జిల్లాలోని వివిధ సీహెచ్‌సీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు & ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అదన కలెక్టర్ డేవిడ్ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ డీఎంఈ, టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వేతనాల కోసం ఏజెన్సీలను సంప్రదిస్తే ‘రేపు-మాపు’ అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగులు అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
కొన్ని ఏజెన్సీలు ఉద్యోగుల ఈపీఎఫ్ నిధులను సక్రమంగా జమ చేయడం లేదని, ఈఎస్ఐ కార్డులు, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం రూ.26 వేలును అమలు చేయడంతో పాటు ప్రతి నెలా 5వ తేదీలోపు ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా పే స్లిప్‌లు ఇవ్వడం, అపాయింట్‌మెంట్ లెటర్లు, డ్రెస్ కోడ్, ఐడీ కార్డులు అందజేయడం వంటి అంశాలను కూడా అమలు చేయాలని కోరారు. ఈపీఎఫ్ నిధులు జమ చేయని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపత్రం ప్రతులను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, డీసీహెచ్‌ఎస్ అధికారులకు కూడా అందజేసినట్లు తెలిపారు.






