28 July, 2026 | 2:01 AM

ఇషా పసిడి గురి

28-07-2026 01:05 AM
  1. షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం
  2. మరోసారి హైదరాబాదీ షూటర్ అద్భుత ప్రదర్శన
  3. మను బాకర్‌కు కాంస్యం

హ్యాంగ్‌చౌ (చైనా), జూలై 27 : హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి అదరగొట్టింది. కొంతకాలంగా అద్భుతమైన విజయాలతో దూసుకెళుతున్న ఇషా మరోసారి ప్రపంచకప్‌లో మెరిసింది. చైనాలోని హ్యాంగ్ చౌ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం గెలుచుకుంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ తుది పోరులో ఇషా సింగ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నిలకడగా రాణించి 40 హీట్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది.

ప్రపంచ రికార్డుతో బరిలో నిలిచిన ఆమె ఆరంభం నుంచే ఆధిపత్యం కనబరిచింది. 50 షాట్లకు 40 పాయింట్లు సాధించింది. ఈ ప్రదర్శనతో అగ్రస్థానాన్ని సాధించి స్వర్ణాన్ని అందుకుంది. 37 షాట్లతో చైనాకు చెందిన యూ జాంగ్ రజతం సాధించగా, మరో భారత షూటర్, ఒలింపిక్ మెడల్ విజేత మను బాకర్ మూడోస్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. స్వర్ణపతకమే లక్ష్యంగా బరిలోకి దిగినప్పకీ కాంస్యం కోసం కొరియా షూటర్ జియోంగ్‌తో తలపడింది. డబుల్ షూట్ ఆఫ్ లో మను బాకర్ గెలిచింది.

ఓవరాల్‌గా ఇషా సింగ్, మను బాకర్ విజయాలతో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు డబుల్ పోడియం దక్కినట్టయింది.  హాంగ్‌చౌ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఆతిథ్య చైనా ఆరు స్వర్ణాలతో సహా 14 పతకాలను గెలుచుకొని పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ మూడు పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఇషా సింగ్ స్వర్ణం, మను భాకర్ కాంస్యం నెగ్గగా, ఈ ఇద్దరికంటే ముందు సైనియం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రజత పతకం దక్కించుకుంది.

వచ్చే ఒలింపిక్స్‌లో మెడల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇషా సింగ్ దానికి తగ్గట్టే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. మే 2026లో జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో ఆమె వరల్జ్ రికార్డు నెలకొల్పింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 50 పాయింట్లకు గాను 43 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. కేవలం 13 సంవత్సరాల వయసులోనే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సీనియర్ కేటగిరీలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ప్రతీ జాతీయ,

అంతర్జాతీయ పోటీల్లో ఇషా సింగ్ ప్రదర్శన అత్యుత్తమంగానే సాగుతోంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నా మెడల్ చేజారింది. ఈ సారి లాస్ ఏంజెలిస్‌లో మాత్రం పోడియంపై నిలబడతానని ఇషా సింగ్ ధీమాగా ఉంది. వచ్చే ఆసియా క్రీడల్లోనూ ఇషా సింగ్‌పై భారీ అంచనాలున్నాయి. 2024 ఆసియా క్రీడల్లో ఈషా సింగ్ మొత్తం నాలుగు పతకాలను గెలుచుకుంది. ఇషా సింగ్ వరుస విజయాలతో వచ్చే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో షూటింగ్‌కు సంబంధించి అంచనాలు మరింత పెరిగాయి. ఇషా వ్యక్తిగత ఈవెంట్లతో పాటు టీమ్ విభాగంలోనూ పతకం ఆశలు రేపుతోంది.