నిరుద్యోగులంటే లెక్క లేదా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులంటే లెక్కలేదని, ఎన్నికల సమయంలో అనేక హామీలి చ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆకాంక్షలను నెరవేర్చకుండా విస్మరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. హైడ్రా ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ అసలైన ‘మొహబ్బత్ కీ దుకాణ్’ బయపడిందని మండిపడ్డారు.
ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారని, యువతకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనదనడానికి ఇదే నిదర్శనమన్నారు. అధికా రంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి.. మాట తప్పిన కాంగ్రెస్ మార్క్ మోసానికి సరూర్‌నగర్ ఘటన నిదర్శనంగా మిగిలిపోనుందన్నారు.
అక్కడ కనిపించింది కేవలం అభ్యర్థుల సమూహం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల తెలంగాణ యువత అనుభవిస్తున్న నైరాశ్యానికి, ఆవేదనకు సజీవ సాక్ష్యమన్నారు. ఉద్యోగార్థులపై పోలీసులు అణచివేత ధోర ణి అవలంబించే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. పోలీసులు, నిరుద్యోగుల మధ్య తోపులాట దృశ్యాలు కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అణచివేత దోరణి అవలంభిస్తున్న కాంగ్రెస్‌కు నిరుద్యోగులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.






