హోటల్ ఫుడ్ సేఫేనా?
- ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కాప్రాలో ఆందోళనకరం
- ఆహార నాణ్యతపై పెరుగుతున్న అనుమానాలు
- కఠిన తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్
ఉప్పల్, ఆగస్టు 4 ( విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కాప్రా ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రయాణికులు ఇలా వేలాది మంది ప్రతిరోజూ హోటల్ ఆహారంపై ఆధారపడుతున్నారు. అయితే ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై తరచూ వినిపిస్తున్న ఫిర్యాదులు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి.
నాణ్యత లేని నూనెల వినియోగం
ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి రోజు వేలాది ప్లేట్ల ఆహారం ఈ ప్రాంతాల్లో విక్రయమవుతోంది. కొన్ని హోటళ్లలో వంటశాలల నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వ, వంటకు ఉపయోగించే నూనెల నాణ్యత, సిబ్బంది పరిశుభ్రత వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో కొందరు నాణ్యత విషయంలో రాజీ పడుతున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పారిశ్రామిక ప్రాంతంలో..
నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతాలు, కాప్రా నివాస కాలనీలు, ఉప్పల్ వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల రద్దీ అధికంగా ఉండటంతో బయట భోజనం చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆహార భద్రతకు అత్యంత ప్రాధా న్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో కలుషిత ఆహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫిర్యాదులు చేసినా..
మల్లాపూర్లోని కొన్ని హోటళ్లపై స్థానికు లు ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆహార పదా ర్థాలను ఎక్కువసేపు నిల్వ ఉంచడం, పదేపదే ఒకే నూనెను వినియోగించడం, సరైన శీతలీకరణ సదుపాయాలు లేకపోవడం వంటి అంశాలు ప్రజారోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన ఆహారం అందిస్తున్న హోటళ్లు కూడా ఉన్నాయని, మొత్తం రంగాన్ని ఒకే కోణంలో చూడటం సరికాదని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆహార భద్రతా శాఖ అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని,
ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. ఆహారం కేవలం వ్యాపారం కాదు.. ప్రజల ఆరోగ్యం తో ముడిపడిన బాధ్యత అనే భావనతో హో టల్ యాజమాన్యాలు వ్యవహరించాలని వినియోగదారుల సంఘాలు సూచిస్తున్నాయి. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కాప్రా ప్రాంతాల్లో ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ డ్రైవ్ నిర్వహించాలని, హోటళ్ల పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.






