ఎన్నికల ప్రకియ చేపట్టండి
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్‌పై ప్రభుత్వానికి ఐవోఏ లేఖ
న్యూఢిల్లీ, ఆగస్టు 24: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాపై స్పష్టమైన ధృవీకరణను ఇవ్వాల్సిందిగా భారత ఒలింపిక్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. టి. ఉష, తెలంగాణ క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ ఈ ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని, అవసరమైతే స్వతంత్ర ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని సూచించారు.
ఓటు హక్కు ఉన్న అనుబంధ క్రీడా సంఘాల ప్రతినిధుల జాబితాలో స్పష్టత లేకపోవడం అభ్యంతరాలు వ్యక్తమవడం వల్ల ఐవోఏ జోక్యం చేసుకుంది. అసోసియేషన్లో సుపరిపాలన, క్రీడాకారుల ప్రయోజనాలు, భాగస్వామ్య పక్షాలలో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ఈ చర్య తీసుకున్నారు. తుది ఓటర్ల జాబితాను ప్రకటించడానికి ముందే, వస్తున్న అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ ఐవోఏ స్పష్టం చేసింది.ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఐవోఏ తరఫున ప్రత్యేక పరిశీలకులను నియమించనున్నారు.90 రోజుల వ్యవధిలో పూర్తి చేసి, నివేదికను సమర్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఐవోఏ సూచించింది.






