విదేశీయులపై సైబర్ దోపిడీ!
- అమెరికా పౌరులే లక్ష్యంగా అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్
- హెల్ప్‌లైన్ పేరుతో క్రిప్టో మోసాలు, హవాలా మార్గాల్లో మనీ ల్యాండరింగ్
- కోట్ల రూపాయల లూటీ
- ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు వికాస్ కుమార్
- ఇంటర్‌పోల్ హెచ్చరికలతో వెలుగులోకి
రంగారెడ్డి/శేరిలింగంపల్లి, జూలై 28 (విజయక్రాంతి): హైదరాబాద్ వేదికగా అమెరి కా పౌరులను లక్ష్యంగా చేసుకుని కోట్లు దోపిడీకి పాల్పడిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంట ర్ ముఠా గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రట్టు చేసింది. ఈ దందాలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రధాన సూత్రధారి వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీని పీఎంఎల్‌ఏ (మనీ లాండరిం గ్ నిరోధక చట్టం) కింద ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తును ప్రారంభించింది.
అమెరికా కు చెందిన వేలాది మంది పౌరులు ఈ సైబ ర్ ముఠా చేతిలో మోసపోయినట్లు గ్రహించిన అమెరికా ఎంబసీ, ఇంటర్‌పోల్ సహా యంతో భారత దర్యాప్తు సంస్థలను సంప్రదించింది. దీని ఆధారంగా తొలుత సీబీఐ దర్యాప్తు జరపగా, మోసపోయిన సొమ్ము క్రిప్టో రూపంలో విదేశాలకు తరలిపోవడం, అక్రమ మనీలాండరింగ్ జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. 2023లోనే ఈసీఐఆర్ నమోదు చేసి నిధుల మూలాలను లెక్కిస్తూ వచ్చింది.
టెక్ సపోర్ట్ పేరిట సైబర్ భయం
ప్రధాన నిందితుడు వికాస్‌కుమార్ నిమా ర్ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా విశాఖపట్నం, లక్నో, ఇతర మెట్రో నగరాల్లోనూ నకిలీ కాల్ సెంటర్ల సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, పాప్పప్ టెక్నికల్ సపోర్ట్, ఐఆర్‌ఎస్ (అమెరికా టాక్స్ డిపార్ట్మెంట్) అధికారులమని నమ్మిస్తూ అమెరికా పౌరులకు వాయిస్ ఓవర్ ఐపీ కా ల్స్ చేసేవారు. నిందితులు వారి కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని, వైరస్ తీవ్రంగా ఉందో లేదా వారి బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరాలకు వినియోగించబడుతున్నాయని భయపెట్టేవారు. బాధితుల సిస్టమ్లలోకి రిమోట్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్ల ద్వారా ప్రవేశించి, ఆర్టిఫిషియల్ డెడ్ లాక్‌లు సృష్టించేవారు. సమస్య పరిష్కారానికి వందల నుంచి వేల డాలర్లు డిమాండ్ చేసేవారు.
క్రిప్టోకరెన్సీ, హవాలా రూట్లలో..
బాధితుల నుంచి నేరుగా నగదు తీసుకోకుండా గిఫ్ట్ కార్డులు (యాపిల్, అమెజాన్, టార్గెట్), వైర్ ట్రాన్స్‌ఫర్లు, డిజిటల్ పేమెంట్లను స్వీకరించేవారు. ఆ తర్వాత ఆ సొమ్ము ను ట్రాకింగ్ దొరక్కుండా చేయడానికి వివిధ రకాల క్రిప్టోకరెన్సీలు (ఉసడట్, బిటకాయిన్) గా మార్చేవారు. అంతర్జాతీయ క్రిప్టో ఎక్సేంజ్‌లు, డార్క్ వెబ్ పి2పి నెట్వర్కులు, స్థానిక హవాలా వ్యాపారుల ద్వారా ఈ క్రిప్టో ఆస్తులను భారతీయ కరెన్సీగా మార్చుకునేవారు.
నకిలీ కంపెనీతో ‘కిరాణా’ నాటకం
మోసపూరితంగా సంపాదించిన నల్లధనాన్ని చట్టబద్ధమైన ఆదాయంగా చిత్రీకరిం చేందుకు వికాస్ వీసీ సొల్యూషన్స్ పేరుతో ఒక నకిలీ షెల్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీ ఖాతాల్లో కోట్ల రూపాయల సందేహాస్పద క్రెడిట్ లావాదేవీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈడీ విచారణలో కాల్ సెంటర్ నుంచే రూ.కోట్ల ఆదాయం వచ్చినట్లు ఒప్పుకున్న నిందితుడు, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో మాత్రం ఈ మొత్తాన్ని కిరాణా వ్యాపారం, రిటైల్ సేల్స్ ద్వారా వచ్చినట్లు తప్పుడు ఖాతాలు చూపించి అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు.
అరెస్టు అనంతరం చట్టపరమైన నిబంధనల ప్రకారం వికాస్ కుమార్ నిమార్‌ను వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచి కస్టడీకి తీసు కునేందుకు ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంతర్జాతీయ నెట్వర్కులో ఉన్న ఇతర భాగస్వాములు, స్థానిక కాల్ సెంటర్ మేనేజర్లు, హవాలా ఏజెంట్ల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిందితుడికి చెందిన పలు బ్యాంక్ ఖాతాలు, క్రిప్టో వ్యాలెట్లను సీజ్ చేశారు.






