15 June, 2026 | 6:43 PM

దత్తతతో చిన్నారుల జీవితాల్లో వెలుగులు

15-06-2026 05:34 PM

సిద్దిపేట కలెక్టరేట్: సిద్దిపేట జిల్లాలో తొలిసారిగా అంతర్జాతీయ దత్తత ప్రక్రియ ద్వారా 18 నెలల చిన్నారిని విదేశీ దంపతులకు, స్వదేశీ దత్తతలో భాగంగా ఐదు నెలల బాలుడిని రంగారెడ్డి, తొమ్మిది నెలల బాలికను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్ కె.హైమావతి చేతుల మీదుగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో దత్తతను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యతో పాటు వారి అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దత్తత తీసుకోవాలనుకునే దంపతులు అధికారిక మార్గంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సీహెచ్ శారద, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె.రాము తదితరులు పాల్గొన్నారు.