ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన అడ్డగింత
పోలీసులకు ఫిర్యాదు.. 1986లోనే ఇచ్చారంటున్న రజకసంఘం నాయకులు
కూకట్‌పల్లి, మే 22 (విజయక్రాంతి): కూకట్‌పల్లి రజక సంఘం నాయకులు కూకట్‌పల్లి గ్రామం దయార్‌గూడలోని పురాతన స్మశాన వాటికలో శుక్రవారం చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకున్న కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థలం తమదేనంటూ ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్‌పల్లి రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ.. 1986లో అప్పటి మున్సిపల్ చైర్ పర్సన్ హనుమంతరావు సమక్షంలో స్థల యజమాని నాయినేని లింగారావు రజకుల స్మశాన వాటిక కోసం 800 గజాల ఈ స్థలాన్ని దానం చేశారని, అప్పటినుంచి ఈ స్థలాన్ని స్మశాన వాటికగా ఉపయోగిస్తున్నామన్నారు.
1997 అనంతరం ఈ స్థలం చుట్టుపక్కల బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరిగి సమీప కాలనీవాసులు స్మశానవాటిక ఇబ్బందికరంగా ఉంటుందని అభ్యంతరం వ్యక్తంకాగా, చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు. కాగా నాయినేని లింగారావు మానవళ్లం అంటూ విజయ్, వినయ్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరు మాట్లాడుతూ నాయినేని లింగారావు ఈ స్థలాన్ని రజకులకు ఇచ్చినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని, ఉంటే ఆధారాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.






