5 August, 2026 | 3:39 AM

శ్రీ రంగవరం పీహెచ్‌సీ తనిఖీ

05-08-2026 01:04 AM

మేడ్చల్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగావరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ మార్గదర్శ కాల ప్రకారం ఔట్ పేషెంట్ సేవలు, గర్భిణీ స్త్రీలు, శిశు ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమం, ఔషధ నిల్వలు, ల్యాబొరేటరీ సేవలు, రికార్డుల నిర్వహణ, హాజరు పట్టికలు, శుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ఫార్మసీ, ఆరోగ్య కేంద్ర మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

రోగులకు అందుతున్న సేవల నాణ్యతపై ఆరా తీసి, మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.అనంతరం వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎదురవుతున్న కొన్ని పరిపాలనా, మౌలిక సదుపాయాల సంబంధిత అంశాలను సంబంధిత వైద్యాధికారి, డి ఎం హెచ్ ఓ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో ఇదే శ్రీరంగవరం పీహెచ్సీలో వైద్యాధికారిగా సేవలందించిన డా. కె. ఆనంద్, నేడు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారిగా తిరిగి తమ కేంద్రాన్ని సందర్శించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆయన సేవా దృక్పథం, సిబ్బందితో కలిసిమెలిసి పనిచేసే తీరును గుర్తుచేసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.డా. ఆనంద్ కూడా తనకు శ్రీరంగవరం పీహెచ్సీతో ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొంటూ, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.