మైనర్ బాలిక గర్భం దాల్చిన ఘటనపై విచారణ జరపాలి
- బాధ్యులపై పోక్సో కేసు నమోదు చేయాలి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో మైనర్ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024-25 విద్యాసంవత్సరంలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు పూర్తిస్థాయి విచారణ జరగకపోవడం పట్ల బహుజన సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఎదురుగా ఉన్న ఈ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసున్నా విషయం బయటకి పొక్కకుండా ఎన్నో ప్రయత్నాలు జరిగాయని నూతనంగా విధుల్లో చేరిన హాస్టల్ వార్డెన్ కొమ్ము జాన్సన్ ఆరోపించారు.
హాస్టల్‌లో అనైతిక కార్యకలాపాలపై ఫిర్యాదులు అందడంతో 2026 మార్చి 11న అప్పటి జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి విచారణకు ఆదేశించినప్పటికీ గర్భం దాల్చిన విషయం బయటపడకుండా అప్పటి ఇన్చార్జ్ హాస్టల్ వార్డెన్, ఆ పై అధికారులు కిందిస్థాయి సిబ్బందిని బెదిరింపులకు పాల్పడుతూ తనను సస్పెండ్ చేయించారని ప్రస్తుత హాస్టల్ వార్డెన్ ఆరోపించారు. ఈ ఘటనపై ఈ నెల 22న హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఘటనకు బాధ్యులపై వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి హాస్టల్ ఇంచార్జ్ వార్డెన్ కృష్ణవేణి, ప్రస్తుత జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఫిరంగిలను సస్పెండ్ చేయాలని బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే మాదిగ కులానికి చెందిన వార్డెన్ కొమ్ము బాబుకు జరిగిన అన్యాయంపై కూడా ఈనెల 25న జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మైనర్ బాలిక ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పారదర్శక విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.






