23 May, 2026 | 8:49 PM

యువత అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలి

23-05-2026 07:46 PM

ఉపాధి పొందడం నుండి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి

యువజన, క్రీడా వారోత్సవాల సందర్భంగా జాబ్ మేళా

హాజరైన కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె

సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలోని యువత అవకాశాలను అందిపుచ్చుకుని స్వయం సమృద్ధితో ముందుకు సాగాలని, తమలోని ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసి ఉద్యోగాలు పొందే స్థాయి నుండి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. యువజన, క్రీడా వారోత్సవాల సందర్భంగా  ఉద్యోగ సాధన అనే అంశంతో జిల్లా కేంద్రంలోని కె కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత కేవలం విద్యార్హతలతోనే కాకుండా నైపుణ్యాలతో కూడిన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు, శిక్షణ సంస్థలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే యువత భవిష్యత్తు మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాలో నిర్వహించడం జరిగిందని, యువతకు ఉపాధి కల్పించడం కోసం మన జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహించడానికి యంత్రంగం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ప్రభుత్వం యువత కోసం అనేక ఉపాధి, స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తోందని, వాటి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలను యువత ఉపయోగించుకోవాలని అన్నారు. జిల్లాలో యువత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన RSETI, ATC, ITI, TIDES, TASK వంటి సంస్థలు అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా స్వయం ఉపాధి, సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్ పరిజ్ఞానం వంటి అంశాలలో శిక్షణ పొందడం ద్వారా యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

ఎస్పీ మహేష్ బి గితె మాట్లాడుతూ... యువత జీవితంలో క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల ఎంతో ముఖ్యమన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి పనిచేస్తే విజయాన్ని తప్పకుండా సాధించవచ్చని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. జాబ్ మేళాలో 25 వివిధ ప్రైవేట్ కంపెనీలు, శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు.

ఇంటర్వ్యూ లలో పలు కంపెనీల్లో ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు, సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎల్ డీ ఎం మల్లికార్జున రావు, యువజన, క్రీడా శాఖ అధికారి రాందాస్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మైనారిటీ శాఖ అధికారి భారతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, తహసీల్దార్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.