22 July, 2026 | 4:58 AM

బీఆర్‌ఎస్ నేతల వినూత్న నిరసన

21-07-2026 12:00 AM
  1. రోడ్లపై గుంతల్లో వరి నాట్లు వేసిన ఆ పార్టీ నేతలు
  2. రాష్ట్రంలో పడకేసిన కాంగ్రెస్ పాలన 
  3. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు
  4. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్

మేడ్చల్ అర్బన్, జూలై 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సస్యలపై స్పందించకుండా కాలయాపన చేస్తుందని నిరసిస్తూ మేడ్చల్ లో రోడ్లపై ఏర్పడిన గుంతలో మరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజి చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా పడకేసిందని ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ప్రభు త్వం తీవ్రంగా విఫలమైందని  తీవ్రస్థాయిలో ఆరోపించారు.

మేడ్చల్ పట్టణంలో జాతీయ రహదారి నుండి మేడ్చల్ రైల్వే స్టేషన్ వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారిలోనే ప్రభుత్వ ఆస్పత్రి, బాలుర, బాలికల పాఠశాలలు,సబ్ రిజిస్టర్,తహసిల్దార్, పాస్పోర్ట్, ఏసిపి వంటి అనేక ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని గుర్తు చేశారు.అంతే కాకుండా రోజు వారీగా వేలాది మంది ప్రజలు,విద్యార్థులు,బస్సులు సంచరించే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైందని భాస్కర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నపాటి వర్షానికే రోడ్లపై మ్యాన్హోళ్లు తెరుచుకోని ప్రమాదకరంగా మారాయని, ఇప్పటికే పలువురు పాఠశాల విద్యార్థులు మ్యాన్ హోళ్లలో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన జీహెచ్‌ఎంసీ అధికారుల్లో మాత్రం చలనం లేదని ఆయన మండిపడ్డారు. వర్షాకాలం రాకముందే అండర్ డ్రైనేజీ, మ్యాన్హోళ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, వెంటనే మేడ్చల్ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించి రోడ్లు,అండర్ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని,లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని భాస్కర్ యాదవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  చీర్ల  దయానంద్ యాదవ్, మున్సిపల్ మాజి కోఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి, విష్ణు చారి, నడికొప్పు నాగరాజు, శంకర్ కురుమ. సిహెచ్ పదం గౌడ్ పాల్గొన్నారు.