22 July, 2026 | 4:21 AM

త్వరలోనే అందుబాటులోకి 50 పడకల సర్కారు దవాఖాన

21-07-2026 12:00 AM
  1. రూ.17.5 కోట్లతో అధునాతన ఆసుపత్రి నిర్మాణం
  2. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గడువు

ఆమనగల్లు, జూలై 20 (విజయక్రాంతి): నాలుగు మండలాలకు నడిబొడ్డుగా ఉన్న ఆమనగల్లు మున్సిపాలిటీకి త్వరలోనే మెరుగైన ఉచిత వైద్యం అందనుంది. స్థానిక ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.17.5 కోట్ల అంచనా వ్యయం తో చేపడుతున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.

సోమవారం హైదరాబాద్లోని ఎ మ్మెల్యే నివాసంలో ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన నిర్మాణ పురోగతిపై కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి నిర్మా ణ పనులన్నింటినీ రాబోయే నెల రోజుల్లోగా సమగ్రంగా పూర్తి చేసి, ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నిర్మాణ నాణ్య త విషయంలో ఎక్కడా అలసత్వం వహించవద్దని, ప్రమాణాలకు అనుగుణంగా పనులు శరవేగంగా జరగాలని సూచించారు.

నూతనంగా అందుబాటులోకి రానున్న ఈ 50 పడకల దవాఖానకు తగినంత మంది డాక్ట ర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను త్వరలోనే కలిసి కోరనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల వంటి నాలుగు మండలాల సరిహద్దు ప్రజలకు ఈ ఆసుపత్రి ప్రధాన వైద్య కేంద్రంగా మారనుంది.

అత్యవసర సమయాల్లో,ప్రమాదాలు జరిగినప్పుడు హైదరా బాద్ లేదా సమీప పట్టణాలకు వెళ్లకుండా, స్థానికంగానే కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందనున్నాయి. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ రామ్మోహన్ రెడ్డి, డీఈ కోట య్య, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ తిరుపతి రెడ్డి, ఎమ్మెల్యే పిఆర్వో దేవేందర్ రెడ్డి  అధికారులు పాల్గొన్నారు.