05-02-2026 12:51:15 AM
గుర్రాలగొందిలో వినూత్న ప్రయోగం
సిద్దిపేట, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామంలో పాలనకు కొత్త అర్థం సృష్టిస్తూ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నారు. గ్రామ పాలకవర్గం అంటే సర్పంచ్ ఒక్కరే కాదనీ, వార్డు సభ్యులందరూ సమాన బాధ్యతతో పనిచేయాలన్న దృక్పథంతో వా రికి శాఖల వారీగా బాధ్యతలు కేటాయించి ‘మంత్రులుగా’ ప్రమాణ స్వీకారం చేయించడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఇప్పటివరకు గ్రామాల్లో ఐక్యత లేకపోవడం, పరస్పర ఆరోపణల వల్ల అభివృద్ధి కుంటుపడిన సందర్భాలను గమనిం చిన సర్పంచ్, వార్డు సభ్యులు తమ తమ వార్డులకే పరిమితం కాకుండా గ్రామమంతటికీ సేవలందించేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సభ్యుడికి ఒక ప్రభుత్వ శాఖ తరహాలో బాధ్యతలు అప్పగించి రోజువారీ ప ర్యవేక్షణతో ప్రజలకు మెరుగైన సేవలు అం దించడమే లక్ష్యంగా ‘గ్రామ మంత్రివర్గం’ ఏర్పాటైంది. ఈ కార్యక్రమంతో పాలకవర్గంలో ఉత్సాహం పెరిగిందని, బాధ్యత భావం మ రింత బలపడిందని గ్రామస్తులు చెబుతున్నారు.
ప్రజల భాగస్వామ్యం, అధికారుల సహకారం, మాజీ మంత్రి హరీష్ రావు తోడ్పాటుతో గుర్రాలగొందిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ స్పష్టం చేశారు. గ్రామస్థాయిలోనే రాష్ట్ర పాలన నమూనాను అమలు చేస్తూ బాధ్యతాయుతమైన పాలనకు నాంది పలికిన ఈ వినూత్న ప్రయత్నం ఇతర గ్రామాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని గ్రామం గుమ్మాల వరకు తీసుకెళ్లే ఈ ‘మంత్రివర్గ’ విధానం గుర్రాలగొందిని అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
పారదర్శక పాలన...
పారదర్శకమైన పాలన అందించేందుకే వార్డు సభ్యులకు శాఖల కేటాయింపు జరిగింది. వార్డు సభ్యులు భవిష్యత్తులో మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యంతో నూతన విధానానికి పురుడు పోశాము. జాతీయస్థాయి అవార్డులు సాధించడమే లక్ష్యంగా కీలకంగా పని చేస్తాం. ఈ విధానం ప్రజలకు, పాలకులకు ఉపయోగపడే విధంగా ఉంటుందని భావిస్తున్నాను.
ఆకుల స్వప్న హరీష్ సర్పంచ్ గుర్రాలగొంది.