05-02-2026 12:50:42 AM
రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్
ముషీరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం బీసీల హక్కుల సాధన కోసం భావజాలవ్యాప్తి చేస్తూ గళమెత్తేందుకు, కలమెత్తేందుకు ఆవిర్భవించిందే ’బీసీ రచయితల సమాఖ్య’ అని తెలంగాణ సాహి త్య అకాడమి మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు జూలూ రు గౌరీశంకర్ తెలిపారు. సమాఖ్య ఆవిర్భావ కార్యక్రమం బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది.
సమాఖ్య పోస్టర్ను సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ గాజోజు నాగభూషణం, అరసం రాష్ట్ర కార్యదర్శి రాపోలు సుదర్శన్ తదితర కవులు, రచయితలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జూలూ రు మాట్లాడుతూ రాజ్యాంగమే ప్రమాణంగా స్థానిక సంస్థల నుంచి చట్ట సభల వరకు బీసీలకు తమ వాటా ప్రకారం లభించాల్సిన సీట్లను సాధించుకునేందుకు బీసీల ను ఏకం చేయటమే ఏకైక లక్ష్యంగా బీసీ రచయితల సమాఖ్య ముందకు సాగుతుందన్నారు.
కోట్లాది మంది బడుగుల సామూ హిక స్వప్నమైన బీసీ రాజ్యాధికారం సాధించాలన్న ఒకే ఒక లక్ష్యంతో సాహిత్య సృష్టి చేయటమే ’బీసీ రచయితల సమాఖ్య’ కర్తవ్యమని తెలిపారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆట, పాట, మాట రూపకల్పనలు ఎలా జరిగాయో ఇప్పుడు బీసీ ఉద్యమానికి సాహిత్య ధూంధాలు ఎగిసిపడవలసి ఉందని వివరించారు.
బీసీ రచ యితల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ గాజోజు నాగభూషణం మాట్లాడుతూ త్వరలో 33 జిల్లాల కమిటీలను వేస్తామని తెలిపారు. అరసం రాష్ట్ర కార్యదర్శి రాపోలు సుదర్శన్ మాట్లాడుతూ బీసీ రచయితల సమాఖ్య భవిష్యత్తులో తన వంతుగా చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని ఆశిస్తున్నామన్నారు.