పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
వెంకటాపురం (నూగూరు) జూలై 21 (విజయ క్రాంతి): మండలంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందని ద్రాక్షలా మారిందని విమర్శించారు.
మండలంలో వేలాది పేద కుటుంబాలు గుడిసెలలో, బరకాల కింద, రేకుల షెడ్లలో నేటికీ నివసిస్తున్నారని ఆరోపించారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పదుల సంఖ్యలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. గ్రామ సభల ద్వారా అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంఠం సత్యం, గొంది రమణయ్య, సోలం రంగయ్య, గంగిన బోయిన కృష్ణ, కంతి వెంకయ్య, సిరిగిరి సత్యవతి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.






