ఇందిరమ్మ వల్లే గిరిజన బతుకుల్లో వెలుగులు
నాగర్ కర్నూల్ జిల్లాకు చేరిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర
ఎస్టీ రిజర్వేషన్లకు 50 ఏళ్లు పూర్తి సందర్భంగా కృతజ్ఞత యాత్ర
గిరిజన నిధులను కాలేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించిన కేసీఆర్
నాగర్ కర్నూల్, జూన్ 26 (విజయక్రాంతి): మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ ప్రజా ప్రతినిధులు చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.
వారికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గిరిజన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మాట్లాడారు. గిరిజనుల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. ఇందిరా గాంధీ కల్పించిన ఎస్టీ రిజర్వేషన్లు గిరిజనుల అభ్యున్నతికి పునాది వేశాయని పేర్కొన్నారు.
గత పదేళ్లలో గిరిజనులకు కేటాయించాల్సిన నిధులను కాలేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించారని మాజీ సీఎం కేసీఆ్ప విమర్శలు గుప్పించారు. ఇదే వర్గానికి చెందిన కొంతమంది అమాయకులను వారు చెప్పు చేతుల్లో ఉంచుకొన్న బీఆర్‌ఎస్ పార్టీ ఈ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. వారితో పాటు డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్తో పాటు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.






