27 June, 2026 | 3:06 AM

ఈగల్ ఫోర్స్ భారీ ర్యాలీ

27-06-2026 01:53 AM

ఆలోచింపజేసిన విద్యార్థుల ప్రదర్శనలు

డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ

సిరిసిల్ల, జూన్ 26 (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.

ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈగల్ ఫోర్స్ ఆద్వర్యంలో మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై జిల్లావ్యాప్తంగా వివిధ విద్యాలయాల్లో వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుంచి పద్మనాయక కల్యాణ మండపం వరకు నిర్వహించారు. అనంతరం మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, నష్టాలపై స్కూల్ విద్యార్థులు, సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేశాయి. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్ బీ డీఎస్ పీ వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.