జిల్లాలో ఘనంగా మొహర్రం వేడుకలు
సంగారెడ్డిలో పాల్గొన్న టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి/జహీరాబాద్/మునిపల్లి, జూన్ 26 : సంగారెడ్డి జిల్లాలో మొహర్రం పండగ వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఆశిర్ ఖాన వద్ద మొహర్రం వేడుకలు ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన వారికి పాయసం అందించారు. అలాగే జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి, కోహీర్ మండలాల్లో మొహర్రం ఉత్సవాలు జరుపుకున్నారు. అసైదుల ఆటలు ఆడుతూ పీర్లను ఊరేగించారు. మునిపల్లి మండలం ఖమ్మంపల్లిలో గ్రామ సర్పంచ్ గుజ్జరి ప్రభుదాస్ ఆధ్వర్యంలో పీర్లకు దట్టీలు కట్టి గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో నాయకులు తక్కడపల్లి సంగమేశ్, పైతరి మల్లన్న, ఫిరోజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.






