సెన్సెక్స్ 226 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్లు వృద్ధి
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కాసేపు ఒత్తిడికి లోనయ్యాయి. ఆ తర్వాత ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించిన సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం 76,598.84 (క్రితం ముగింపు 76,532.96) వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. కాసేపు లాభ నష్టాల మధ్య కొనసాగిన సూచీ ఇంట్రాడేలో 76,401.13 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫార్మా షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించిన సూచీ 76,962.88 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని చేరింది. చివరికి 226 పాయింట్ల లాభంతో 76,759 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 23,249 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్, ఐటీసీ హోటల్స్, బజాజ్‌ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్ టెక్ మహీంద్రా, జొమాటో, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76.05 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,788.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.