న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) 2024-25 ఆర్థిక సర్వే(Economic Survey)ను లోక్ సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ప్రసంగించిన అనంతరం సీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla) సభను శనివారానికి వాయిదా వేశారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆర్థిక సర్వే అనేది ఆర్థిక వ్యవస్థ(Economy) స్థితిని సమీక్షించడానికి కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం సమర్పించే వార్షిక పత్రం.
ఆర్థిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక విభాగం తయారు చేస్తుంది. మొదటి ఆర్థిక సర్వే 1950-51లో ఉనికిలోకి వచ్చింది. అప్పుడు ఇది బడ్జెట్ పత్రాలలో భాగంగా ఉండేది. 1960లలో దీనిని కేంద్ర బడ్జెట్ నుండి వేరు చేసి బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి శనివారం సమర్పించనున్నారు. ఇది గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును పరిగణంలోకి తీసుకొని రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఆర్థిక సర్వే.