17 June, 2026 | 3:27 AM

‘భారతీయత- 2026’ వైభవోత్సవం

17-06-2026 01:01 AM

అమెరికాలో ఘనంగా నిర్వహణ

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం ఏవాన్ హై స్కూల్ ప్రాంగణంలో ‘సత్సంకల్ప ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘భారతీయత- సాంస్కృతిక-ఆధ్యాత్మిక మహోత్సవం జూన్ 13న అత్యంత వైభవంగా జరిగింది.

భారతీయ మహర్షుల జ్ఞాన సంపద, వారస త్వాన్ని స్మరిస్తూ నిర్వహించిన ఈ వేడుకకు అమెరికాతో పాటు ప్రపంచ నలుమూలల నుండి 800 మందికి పైగా ప్రేక్షకులు, కళాకారులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా మాజీ భారత రాయబారి డాక్టర్ మిత్రా వశిష్ఠ, విశిష్ట అతిథిగా న్యూయార్క్ భారత దౌత్య కార్యాలయ ప్రతినిధి సేవాంగ్ గ్యాల్ ట్సన్ హాజరయ్యారు. వేదికపై ఫౌండేషన్ నూతన లోగోతో పాటు ‘పరాశర సంహిత’, ‘గురుదేవోభవ’ అనే విశిష్ట గ్రంథాలను ఆవిష్కరించారు.

సుపథ ఫౌండేషన్ ట్రస్టీ కుమారి రాధారాణిని సన్మానించి, ప్రముఖులకు ‘శివానంద స్మృతి పురస్కారాలు’ ప్రదానం చేశారు. భరద్వాజ మహర్షి వైమానిక, ఆయుర్వేద రంగాలలో చేసిన కృషిని చాటే ‘జ్ఞాన కేంద్రం’ ప్రదర్శన, అలాగే ‘సీర్స్ ఆఫ్ భారత్ భరద్వాజ మహర్షి’ నృత్యనాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుక విశేషాలను న్యూయార్క్ నగరంలోని ప్రపంచ ప్రసిద్ధ ‘టైమ్స్ స్క్వేర్’ వేదికపై ప్రదర్శించడం విశేషం. మహర్షులు అందించిన సనాతన ధర్మం, జ్ఞానాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ తాళ్లపాక తెలిపారు.