చాంపియన్స్‌కు షాక్
ఐర్లాండ్ చేతిలో ఓడిన భారత్
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఐరిష్ టీం
సిరీస్‌లో 1 ఆధిక్యంలో ఐర్లాండ్
టీ ట్వంటీ వరల్ ఛాంపియన్స్ టీమిండియాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ భారత్‌పై సంచలన విజయం సాధించింది. సొంతగడ్డపై ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ఐర్లాండ్ చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఆరంభంలో ఐర్లాండ్ వికెట్లు తీసినా తర్వాత బౌలర్లు పట్టుజారవిడిచారు. ఫలితంగా భారీస్కోరు చేసిన ఐరిష్ టీమ్ అదే జోష్ తో బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. దీంతో కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ప్రయాణం ఓటమితో మొదలైంది.
బెల్‌ఫాస్ట్, జూన్ 26: టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అందరూ ఎదురుచూస్తున్నట్టు వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్ కాంబినేషన్‌ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేని భారత్ వైభవ్‌ను ఫైనల్ ఎలెవన్ లోకి తీసుకోలేదు. ఆరంభం నుంచే ఐర్లాండ్‌ను భారత పేసర్ హర్షిత్ రాణ కంగారెత్తించాడు.
గాయం నుంచి కోలుకుని తిరగొచ్చిన హర్షిత్ రాణా, అర్షదీప్ తో కలిసి ఐరిష్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఐర్లాండ్ 51 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో కనీసం 120 పరుగులైనా చేస్తుందా అంటూ చాలా మంది అనుకున్నారు. ఈ దశలో కెప్టెన్ టక్కర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గారెత్ తో కలిసి కీలకమైన 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టక్కర్ 36 బంతుల్లో 50 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ కు ఔటవగా.. తర్వాత గారెత్ (49), డాక్ రెల్ తో కలిసి 49 పరుగులు జోడించారు.
దీంతో తక్కువ స్కోరుకే పరిమితమవుతుందనుకున్న ఐర్లాండ్ 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, అర్షదీప్ సింగ్2, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. 183 పరుగుల లక్ష్యఛేదనలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా చాలా ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఐర్లాండ్ బౌలర్లు భారత్‌కు షాకిచ్చారు. పవర్ ప్లేలోనే ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), శ్రేయాస్ అయ్యర్ (3) నిరాశపరిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ మాత్రం విధ్వంసం సృష్టించాడు.
ఐర్లాండ్ బౌలర్లపై హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 50 (7 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ చేసి ఔటయ్యాడు. పవర్ ప్లేలో భారత్ 68 పరుగులు చేయడంతో గెలిచేలా కనిపించింది. తిలక్ వర్మ(19), వాషింగ్టన్ సుందర్(9), అక్షర్ పటేల్(15) వెంటవెంటనే ఔటవడంతో మ్యాచ్ ఐర్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన శివమ్ దూబే(25) కూడా రిట్నర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 7వ వికెట్కు నమోదైన 35 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ వెంటనే అక్షర్ పటేల్(15) కూడా ఔటవ్వడంతో భారత్ ఓటమి ఖాయమైంది. సిక్సర్తో జోరు కనబర్చిన హర్షిత్ రాణా(8) క్యాచ్ ఔట్ అవ్వగా.. ఆఖరి వికెట్‌గా అర్షదీప్ సింగ్(2) వెనుదిరిగాడు. చివరకు భారత్ 148 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ బౌలర్లలో మ్యాట్ హోల్డార్డ్(3/28), మాథ్యూ హంప్రేస్(3/38) మూడేసి వికెట్లు తీయగా.. జై మూండ్రా రెండేసి వికెట్లు పడగొట్టాడు. లియామ్ మెక్కార్తీ, గారెత్ డెలానీ తలో వికెట్ తీసారు.
ఈ ఓటమి భారత అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ ఇదే. కాగా భారత్‌పై ఐర్లాండ్‌కు ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి విజయం. గత 8 ప్రయత్నాల్లో దక్కని విజయం ఈ సారి వరించింది. ఈ గెలుపుతో రెండు టీ20ల సిరీస్‌లో ఐర్లాండ్ 1 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం జరిగే రెండో టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.
స్కోరు బోర్డు
ఐర్లాండ్ ఇన్నింగ్స్ : 182/9 (టకర్ 50, డెలానీ 49, డాక్‌రెల్ 19; హర్షిత్ రాణా 3/24, అర్షదీప్ 2/28, అక్షర్ పటేల్ 2/33)
భారత్ ఇన్నింగ్స్ : 148 (అభిషేక్ శర్మ 50, శివమ్ దూబే 25, తిలక్ వర్మ 19; మాథ్యూ 3/38, హోలార్డ్ 3/28, మూండ్రా 2/26)






