చిన్న చిత్రాలకు రాయితీలు కల్పించాలి
ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా మారుతూ నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమాతో దినేశ్‌కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. సతీశ్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేశ్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు.
జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఫోక్ సింగర్ కోమలి ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి. చిన్న సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలి.
తెలంగాణలో చిన్న సినిమాల అభివృద్ధికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. తెలుగు సినిమాల మాదిరిగానే తెలుగు ప్రజలు కూడా ఐక్యంగా ఉండాలి” అన్నారు. హీరో దినేశ్‌కుమార్ మాట్లాడుతూ.. “ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకే కథతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి” అని తెలిపారు. ‘ఈ చిత్ర కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంద’ని హీరోయిన్ దివిజ చెప్పారు. దర్శకుడు సతీశ్ ఆవాల మాట్లాడుతూ.. “భారతీయ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం.
కుటుంబాల్లో తలెత్తే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ చిత్రం చూపిస్తుంది” అన్నారు. నిర్మాత కోమలి మాట్లాడుతూ.. “ఇదొక ఆడబిడ్డ కన్నీటి కథ. నా జీవితంలో ఎదురైన అనుభవాలను ఈ చిత్రంగా మలిచాను. సినిమా చూస్తున్నంతసేపు కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారని నమ్ముతున్నా” అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న టాలీవుడ్ దర్శకుడు దశరథ్, ప్రధాన పాత్రధారి మురళీధర్ గౌడ్, సీనియర్ నటి సుధ, జబర్దస్త్ సత్యశ్రీతోపాటు చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ కూడా మాట్లాడారు.






