విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు వేసవికాలంలో కరెంట్ సరఫరాలో మెరుగైన సేవలు అందించాలని, టీజీఎన్‌పీడీసీఎల్ హన్మకొండ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.మధుసూదన్ చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్-1) బి.అశోక్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పెన్షనర్ల భవన్లో విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిరంతర విద్యుత్ సరఫరా అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు.
33, 11 కేవీ ఫీడర్లకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దెబ్బతిన్న డీటీఆర్‌లను శాఖకు చెందిన వాహనాల ద్వారా ఉచితంగా తరలించాలని పేర్కొన్నారు. అలాగే ఫెయిల్ అయిన ట్రాన్స్‌ఫార్మర్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు.
వేసవి కాలానికి అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఓవర్‌లోడ్ నివారణ కోసం కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని సూచించారు. వినియోగదారులకు 1912 ద్వారా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. భద్రతా అవగాహన కార్యక్రమాలు, పల్లె బాట నిర్వహణపై దృష్టి పెట్టాలని తెలిపారు. అదేవిధంగా ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు చేసి, వాటి మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేయాలని, సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు.




