వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
- రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి
- గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మరణీయమని, ఆయన రైతు సంక్షేమానికి చేసిన కృషిని గుర్తిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం ప్రజ్ఞాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పీసీసీ నాయకుడు నాయిని యాదగిరితో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ హయాంలో రైతులు, పేదలు, విద్యార్థులు, సామాన్య ప్రజల సంక్షేమానికి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. పంట రుణమాఫీ, జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు.
అలాగే రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం, సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడం, ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా పంపిణీ చేపడుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడం వంటి కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని నర్సారెడ్డి పేర్కొన్నారు.






