ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
చర్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు... కేక్ కటింగ్, పూలమాలలు
చర్ల,(విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు ఆధ్వర్యంలో రాజన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి జిల్లా జనరల్ సెక్రటరీ సోడి చలపతి, ఆత్మ కమిటీ చైర్మన్ బుచ్చిబాబు, జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ కారంపూడి సాల్మన్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాసేవకు మారుపేరని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన అమలు చేసిన పథకాలు దేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయని అన్నారు.






