అక్రమంగా జామాయిల్ చెట్లు నరికివేత
మఠంపల్లి మే 18(విజయ క్రాంతి): అటవీ సంపద కోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వన మహోత్సవం పేరుతో మొక్కలను నాటడం మరియు సంరక్షించడం లాంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని పెదవీడు రెవెన్యూ పరిధిలో ఉన్న గుర్రంబోడు తండా గ్రామం సరిహద్దులో ఉన్న సర్వే నెంబర్ 540 ప్రభుత్వ భూమిలో జామాయిల్ చెట్ల నరికివేత చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ నిబంధనలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తూ గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తమకు డి ఫారెస్ట్ పట్టాలు ఉన్నాయంటూ ఆదివారం సుమారు 32 ఎకరాల్లో ఉన్న పచ్చని జామాయిల్ చెట్లను నరికి భూమిని ఆక్రమిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గత 1998-99వ సంవత్సరంలో డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం 108 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు అప్పగించింది. అప్పటినుంచి ఈ భూములను అటవీ శాఖ అధికారులు సంరక్షిస్తున్నారు. ఇంత జరుగుతున్న అటవీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండి పడ్డారు.
ఇదే విషయంపై క్యు న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఇంచార్జి అధికారి ఆదిత్య తో ఫోన్లో వివరణ కోరగా ఈ విషయం తమకు దృష్టికి వచ్చిందని తాము పరిశీలించి, ఆక్రమణదారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలా కొందరు ఇష్టా రాజ్యాంగ చెట్లను నరకడం, భూములను ఆక్రమించడంపై ప్రకృతి ప్రేమికులు,ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోట్లాది రూపాయల విలువైన భూములను, చెట్లను రక్షించాలని అటవీ అధికారులను కోరుతున్నారు.






