బీసీల జోలికి వస్తే తరిమికొడుతాం
- మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ -
- ఈశ్వరమ్మ యాదవ్‌కు బీసీ నాయకుల సంఘీభావం
ఎల్బీనగర్, జులై 15 : బిడ్డా... మా జోలికి వస్తే తరిమికొడతాం.... బీసీలను అవమానిస్తే పాతాళానికి తొక్కి పెడుతామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బీసీ నాయకురాలిపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాల నాయకులు భగ్గుమన్నారు. మూడు రోజులుగా బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం వివిధ పార్టీలకు చెందిన బీసీ ప్రజాప్రతినిధులు,
మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎల్బీనగర్ లో ఉన్న ఈశ్వరమ్మను ఆమె నివాసంలో కలిసి సంఘీభావం తెలిపారు. ఈశ్వరమ్మను కలిసి వారిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం, బీఆర్‌ఎస్ నాయకుడు క్యామ మల్లేశ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, ద తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యు రాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు.
అగ్రకుల అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈశ్వరమ్మ ఒంటరిది కాదని... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లు అంతా ఆమె వెంటే ఉన్నారన్నారు. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల జోలికి అగ్రవర్ణాల నాయకులు వస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ అనేకమంది మన్ననలు పొందిన ఈశ్వరమ్మను ఆమె వయసును చూడకుండా దుర్భాషలాడడం రెడ్డి కుల అహంకారం కాదా? అని ప్రశ్నించారు. ఈశ్వరమ్మ యాదవ్ మా అందరికి తల్లి లాంటిది... ఆమెను నోటికి వచ్చినట్లు తిడితే పాతాళానికి తొక్కి పెడుతామని హెచ్చరించారు.
ప్రజా సేవా చేయాలనే సంకల్పంతో ఈశ్వరమ్మ చాలా సేవలు చేసిందని, ఆమెకు మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రి ఒక నామినేటెడ్ పదవి ఇస్తే అదే పార్టీకి చెందిన అగ్రకుల నాయకుడు సహించలేక పోతంన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వరమ్మ యాదాద్రి బోర్డు మెంబర్ గా బాధ్యతలు స్వీకరించిన సంతోషం ముగియక ముందే ఫ్లెక్సీలో ఫొటో పెట్టలేదని కుల అహంకారంతో బీసీ కులాల మీద దాడి చేస్తారా? అని ప్రశ్నించారు.
పదవులు ఎవరికి శాశ్వతం కాదు. ఇప్పటి నుండి బీసీ బిడ్డల మీద దౌర్జన్యాలు జరిగితే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటినుండి వెనుకబడిన కులస్తుల మీద దౌర్జన్యాలు జరిగితే బట్టలు ఉడదీసి కొడతామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఈశ్వరమ్మకు బీసీ నాయకులు దూదిమెట్ల ఆంజనేయులు యాదవ్, చింతల రవీంద్రనాథ్ యాదవ్, బద్దుల వెంకటేశ్, చాపాల శ్రీనివాస్ యాదవ్, గుజ్జ కృష్ణ, సత్యం, శ్యామ్ తోపాటు యాదవ్ సంఘం, కురుమ సంఘం, బీసీ సంక్షేమ సంఘంతోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రతినిధులు మద్దతు తెలిపి, సంఘీభావం ప్రకటించారు.






