చాందలో పార్శ్వనాథ శిల్పం
- తెలంగాణలో తొలిసారిగా వెలుగులోకి
- 9వ శతాబ్దానికి చెందినదిగా ‘కొత్త చరిత్ర బృందం’ అంచనా
- జైన కళావైభవానికి చారిత్రక ఆధారం
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా చాంద గ్రామం జైన ధర్మ కేంద్రంగా వెలుగొందిందని చెప్పడానికి మరో కీలక ఆధారం లభించింది. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న అనేక శిల్పాల మధ్య అత్యంత అరుదైన పార్శ్వనాథుని శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్రబందం పరిశోధక సభ్యుడు పృథ్వీరాజ్ రొడ్డావార్ తన సహచరులు సాయిరాజ్ కాంబ్లే, కత్తూరి సుభాష్‌లతో కలిసి గుర్తించారు. తెలంగాణలో ఇప్పటివరకు లభించని లక్షణాలతో కూడిన ఈ శిల్పం.. జైన కళా వైభవానికి ఆనవాలుగా చరిత్రబృందం పేర్కొంటుంది.
పార్శ్వనాథ శిల్పానికి తల భాగం ధ్వంసమైనప్పటికీ, అర్ధ పద్మాసనంలో ఆసీనుడైన పార్శ్వనాథుని వెనుక సర్పం చుట్టుకొని, ఇరువైపులా కాయోత్సర్గ భంగిమలో తీర్థంకరుల ప్రతిమలు, అధిష్ఠాన పీఠంపై రెండు సింహాల మధ్య ధర్మచక్రం చెక్కబడి ఉంది. అలాగే సర్పఛత్రంతో జైన యక్షుడు ధరణీంద్రుడు, యక్షిణి పద్మావతి, వారికి వెలుపల నమస్కరిస్తున్న శ్రావక--శ్రావికల రూపాలు శిల్ప కళాత్మకతను ప్రతిబింబిస్తున్నాయి.
బీహార్, మహారాష్ట్ర శిల్పాలతో పోలికలు
శిల్పశైలిని బట్టి పార్శ్వనాథుని శిల్పం 9వ శతాబ్దానికి చెందిందని ఈ శిల్పాన్ని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్రబందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ భావిస్తున్నారు. బిహార్‌లోని రాజగిర్, మహారాష్ట్రలోని తూర్పుఖాందేశ్ ఎరందోల్ ప్రాంతాల్లో లభించిన పార్శ్వనాథ శిల్పాలతో దీనికి పోలికలు ఉన్నాయని, పార్శ్వనాథుని శిల్పం అధిష్టానాలమీద ధర్మచక్రం చెక్కివున్నదని జైన ప్రతిమాలక్షణగ్రంథం ‘జైన రూపమండన’లిలో పేర్కొనబడ్డదని పేర్కొన్నారు.
ధర్మచక్రం ఉండటంతో ఇది బుద్ధుని శిల్పమనే సందేహం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, బుద్ధుని విగ్రహాల్లో కనిపించే ధర్మచక్ర పరివర్తన ముద్ర, సంఘాతి వధారణ ఇందులో లేవని ప్రముఖ స్థపతి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కాబట్టి ఇది పార్శ్వనాథుని శిల్పమేనని, ఇటువంటి ప్రతిమ ఇప్పటివరకు తెలంగాణలో ఎక్కడా లభించలేదని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఇక్కడే కుంథునాథుని శిల్పం లభ్యం
చాంద గ్రామంలోనే లభించిన మరొక శిల్పం ఎడమవైపుపై ముక్కలో అభిషేకిస్తున్న ఏనుగు, దానికింద రెండు వరుసల్లో ముగ్గురేసి జైనతీర్థంకరులు కనిపిస్తున్నారు. ఇది జైనరూపమండన ప్రకారం మరొక పార్శ్వనాథుని శిల్పంలోని భాగమని తెలుస్తున్నది. గతంలో ఇక్కడే 17వ జైన తీర్థంకరుడు కుంథునాథుని శిథిల శిల్పాన్ని గుర్తించారు పృథ్వీరాజ్ రొడ్డావార్. ఇక్కడ లభించిన జైనధర్మ శిల్పాల ఆధారంగా ఈ ప్రాంతం చాంద జైనబసదిగా వుండేదని కొత్త చరిత్ర బృందం భావిస్తోంది.
క్షేత్ర పరిశోధన, ఫొటోగ్రఫీ: పృథ్వీరాజ్
రొడ్డావార్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు- -9701361356
ప్రతిమాలక్షణ వివరణ: శ్రీరామోజు
హరగోపాల్, కొత్త తెలంగాణచరిత్ర బృందం కన్వీనర్ - 9949498698






