13 April, 2026 | 2:49 AM

కాకతీయుల నాటి రాతి విగ్రహాల గుర్తింపు

13-04-2026 01:25 AM

నిర్మల్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): కాకతీయుల కాలం నాటి రాతి విగ్రహాలను ఉమామహేశ్వర విగ్రహాలు గండి రామన్న క్షేత్రంలో గుర్తించినట్టు ప్రముఖ కవి పరిశోధకులు తుమ్మల దేవరాలు తెలిపారు. నిర్మల్ జిల్లా చరిత్ర మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే శాతవాహన, రాష్ట్ర కూట, చాళుక్య, కాకతీయ రాజవంశాల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందినట్లు అనేక శాసనాలు, ప్రతిమలు, లిఖిత ఆధారాలు తెలియజేస్తున్నాయి.

తాజాగా నిర్మల్ పట్టణానికి సమీపంలోని గండి రామన్న క్షేత్రం వద్ద రాతి గుట్టల మధ్య ఉన్న సహజ గుహ లో కాకతీయుల కాలానికి చెందిన రెండు ఉమామహేశ్వర విగ్రహాలు గుర్తించినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావు తెలిపారు. నల్లటి కఠిన శిల (బసాల్ట్)పై చెక్కిన ఈ విగ్రహాలు సుమారు క్రీ.శ. 10వ నుండి 11వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినవిగా అంచనా వేస్తున్నారు. ఒక విగ్రహంలో ఉమాదేవి లలితాసనంలో శివుని ఒడిలో కూర్చుని ఉండ గా, శివుడు జటాజూటధారిగా, శాంత స్వరూపంతో దర్శనమిస్తున్నాడు.

ఆయన చేతుల్లో డమరుకం, త్రిశూలం స్పష్టంగా కనిపిస్తున్నాయి. శిల్పకళలో శివపార్వతులకు కాళ్లకు అందెలు, పట్టగొలుసులు, కర్ణాభరణాలు వంటి ఆభరణాలు సున్నితంగా చెక్కబడి ఉన్నాయంటే ఆ కాలం శిల్పుల నైపు ణ్యం ప్రతిఫలిస్తుంది. విగ్రహం అడుగుభాగంలో శివుని వాహనం నంది ప్రతిష్ఠితంగా కనిపిస్తుంది. ఇదే గుహలో మరో ఉమామహేశ్వర విగ్రహం నంది వా హనం పై విరాజిల్లుతున్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉన్న సహజ రాతి గుహలో ఈ విగ్రహాలు వేల సంవత్సరాలుగా నిలిచి ఉండటం విశేషంగా భావిస్తున్నారు. ఉమామహేశ్వర స్వరూపం దాంప త్య సౌఖ్యం, కుటుంబ శాంతి, ఐక్యతకు ప్రతీకగా భావించబడుతుందని భక్తుల విశ్వాసం అని తెలిపారు.