11 March, 2026 | 5:58 AM

అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ షాక్

11-03-2026 12:14 AM
  1. డారిల్ మిఛెల్‌తో గొడవ
  2. మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా

దుబాయ్, మార్చి 10: భారత పేసర్ అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ షాకిచ్చింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో అతిగా ప్రవర్తించినందుకు జరిమానా విధించింది. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్‌పైకి బంతిని విసిరినందుకు మ్యాచ్ ఫీజులో 15 శాతం ఫైన్ వేసిం ది. అంతేకాకుండా ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ 11వ ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్లో డారి ల్ మిఛెల్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన అర్షదీప్ తర్వాతి బాల్‌ను డాట్ వేశాడు. మిఛెల్ కొట్టిన షాట్‌తో అర్షదీప్ వైపే బంతి రావడం, దానిని అందుకుని వికెట్ల వైపు విసిరే క్రమంలో మిఛె ల్ శరీరానికే బలంగా తగిలింది. దీనిపై మిఛెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్షదీప్ వైపు దూసుకొచ్చాడు. ఏంటి అంటూ అర్షదీప్ సిం గ్ కూడా స్పందించడంతో అంపైర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి నచ్చజెప్పారు.

అర్షదీప్ కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా తర్వాతి బంతిని వేసేందుకు వెళ్లిపోగా అంపైర్ పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఓవర్ ముగిసిన తర్వాత అర్షదీప్ సింగ్ నేరుగా మిఛెల్ దగ్గరకు వెళ్లి సారీ కూడా చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ హగ్ చేసుకుని సరదాగా మాట్లాడుకున్నారు. అయితే ఐసీసీ మాత్రం దీనిని సీరియస్‌గా తీసుకుంది. ఫీల్ అంపైర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఐసీసీ చర్యలు తీసుకుంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రత్యర్థి ఆటగాడిని బంతి లేదా బ్యాట్‌తో ఉద్దేశపూర్వకంగా గాయపరిచేలా ప్రవర్తించడం నేరంగా పరిగణిస్తారు. దీంతో వీడియో ఫుటేజ్ ను పరిశీలించిన రిఫరీ 15 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్‌ను చేర్చారు. దీని ప్రకారం తర్వాతి 24 నెలల్లో మరో డీమెరిట్ పాయింట్ చేరితో అర్షదీప్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు.