27 August, 2026 | 3:16 AM

కాంగ్రెస్‌ను వీడేదిలేదు

27-08-2026 01:55 AM
  1. సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు
  2. కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి
  3. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ 
  4. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజరు

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress)లో మంత్రి కొండా సురేఖ(Konda Sushmita) అంశంపై రోజురోజుకూ ఉత్కంఠ కొనసాగు తోంది. ఆమెపై అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే సస్పెన్స్ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాము కాంగ్రెస్‌ను వీడబోమని కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి స్పష్టం చేశారు. కూతురు వేరు.. రాజకీయం వేరని, సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామన్నారు. ఈ మేరకు బుధవారం కొండా సురేఖ భర్త కొండా మురళి(Konda Murali) ప్రజా భవన్‌(Praja Bhavan)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో భేటీ కావడం ఆసక్తిగా మారింది. వీరిద్దరూ భట్టితో దాదాపు 45 నిమిషాల వరకు సమావేశమయ్యారు. ఈ భేటీలో భట్టితోపాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఉన్నారు.

ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డిపైన సుస్మిత చేసిన వ్యాఖ్యలతో పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగిందనే విషయాన్ని కొండా మురళితో భట్టి విక్రమార్క అన్నట్లుగా తెలిసింది. ఎంత పెద్ద నాయకుడైనా పార్టీ జెండా కిందనే పనిచేయాల్సి ఉంటుందని, వ్యక్తిగత విమర్శలు చేసి వివాదాలకు తావు ఇవ్వడం సరికాదనే అభిప్రాయాన్ని భట్టి వ్యక్తం చేశారని సమాచారం.

పార్టీలో అంతర్గత విషయాలు ఎన్నో ఉంటాయని, వాటన్నింటిపైనా బహిరంగంగా మాట్లాడటం వల్ల ప్రతిపక్షాలకు ఒక అస్త్రాన్ని ఇచ్చినట్లుగా అవుతుందన్నారు. ఈ విషయంలో మురళి కూడా కొంత ఆలోచనలో పడినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

సయోధ్య కుదురుతుందా..? 

అయితే మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నియమావళిని ఉల్లంఘించడం ఇది మూడోసారని, అలాగే చిన్నారెడ్డి సైతం లైన్ దాటి మాట్లాడారని ఇక వీరిని ఉపేక్షిస్తే పార్టీకి తీవ్రనష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ వ్యవ హారాల కమిటీ (డీఏసీ) పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో కొండాపై వేటు తప్పదనే చర్చ జరుగు తున్న వేళ కొండా మురళి భట్టీతో భేటీ కావడం ఆసక్తిగా మారింది.

పార్టీ కఠిన నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు, సయోధ్య కుదిర్చే దిశగా రాజగోపాల్‌రెడ్డి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. రాయబారం ఫలించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకన్న ఈ పరిణామాలు వివాదాన్ని సద్దుమణిగేలా చేస్తాయా..? లేక పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా..? అనేది వేచి చూడాలి. అయితే డిప్యూటీ సీఎం భట్టితో రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడంపై మరో చర్చ జరుగుతోంది.

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు వేస్తే అది తనపై కూడా చర్యలు తప్పవనే రాజగోపాల్‌రెడ్డి అప్రమత్తమయ్యారనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వేటు నుంచి తప్పించుకునేం దుకు ముందస్తుగా భట్టి విక్రమార్కతో రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కూతురు వేరు.. రాజకీయం వేరు 

డిప్యూటీ సీఎం భటి విక్రమార్కతో భేటీ అనంతరం ప్రజాభవన్ వద్ద కొండా మురళి మీడియాతో మాట్లాడారు. ‘సుష్మిత మా బిడ్డనే.. అమెకు 37 ఏళ్లు.. ఆమె బిడ్డకు 15 ఏళ్లు ఉన్నాయి..  కూతురు వేరు.. రాజకీయం వేరు.. ఆమె వ్యాఖ్యల తో మాకు సంబంధం లేదు’ అని కొండా మురళి తెలిపారు. కవిత బీఆర్‌ఎస్ నుంచి బయటికి వెళ్లిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. సుష్మితకు ఆమె మనోభావాలు, అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుందన్నారు.

‘ఆమె మా బిడ్డ అయినప్పటికీ ఆమెను ప్రశ్నించే హక్కు మాకు లేదు’ అని అన్నారు. సుష్మిత ప్లాన్ ‘ఏ’ ప్రకారం వ్యాఖ్య లు చేసిందని, సుష్మిత ప్లాన్ బీ ఏమిటో తనకు తెలియదని కొండా మురళి తెలిపారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు తాను ఏమీ మాట్లాడనని కొండా మురళి తెలిపారు. అధికారిక పనుల్లో భాగంగానే బిల్లుల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగానే కలిసి, యోగక్షేమాలు మాట్లాడుకున్నట్లుగా ఆయన చెప్పారు.