బెల్ట్ షాపుల హవా?
- పెడదారి పడుతున్న గ్రామీణ యువత
- చూసీచూడనట్టు వదిలేస్తున్న అధికారులు
తరిగొప్పుల, ఆగస్టు 26 (విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని 15 గ్రామాల్లో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మండల కేంద్రంతో పాటు అబ్దుల్ నగరం, అక్కెరాజుపల్లె, అంకుషాపురం, బొంతగట్టునాగరం, నర్సాపూర్, పోతారం, సోలిపూర్ తో పాటు కొత్త తండా, మాన్సింగ్ తండా, వాచ్యా తండా వంటి తండాల్లో సైతం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి.
ప్రతి గ్రామంలో కనీసం 2 నుండి 3 బెల్ట్ షాపులు నిర్వహిస్తూ, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ.120 ఉన్న క్వార్టర్ ను రూ.160కి, రూ.140 ఉన్న బీరును రూ.190కి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి తోడు నిషేధిత గుడుంబా (నాటుసారా) విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. దీంతో మండలంలోని యువత మద్యానికి బానిసలై చెడుదారి పడుతోందని ఆవేదన వ్యక్తం అవుతోంది.
గ్రామపంచాయతీ తీర్మానాన్ని బేఖాతరు చేస్తూ...
కొత్త తండా గ్రామంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామపంచాయతీ బెల్ట్ షాపులను నిషేధిస్తూ తీర్మానం చేసినా, కొందరు వ్యాపారులు దొడ్డిదారిన అమ్మకాలు కొనసాగిస్తున్నారన్నారు. ఈ విషయంపై ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
చర్యలు తీసుకోకపోతే ఆందోళన
కొత్త తండా గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, గుడుంబా అమ్మకాలు సాగుతున్నాయి. యువత చెడుదోవ పడుతోంది. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. బెల్టు షాపులను మూయించకపోతే మహిళా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అక్రమంగా మద్యం, గుడుంబా అమ్మే వారిపై ఎక్సైజ్ శాఖ వెంటనే స్పందించి, మండలంలోని అన్ని బెల్ట్ షాపులను సీజ్ చేసి, అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
రాజశేఖర్,
గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు






