27 August, 2026 | 3:27 AM

కీలక ఖనిజాల దిశగా సింగరేణి

27-08-2026 02:24 AM
  1. వ్యూహాత్మక ప్రణాళికతో సంస్థ విస్తరణ
  2. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ట్రానికి గుండెకాయవంటి ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిని లాభదాయకంగా నిలబెట్టి భవిష్యత్‌తరాలకు అందించడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బొగ్గు తవ్వకాలతో పాటు కీలక, ప్యూహాత్మక ఖనిజాల అన్వేషణ చేయాలని అధికారులకు సూచించారు. క్రిటికల్ మినరల్స్, బొగ్గు గనులకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే అన్ని వేలం ప్రక్రియల్లో పాల్గొనాలని చెప్పారు.

బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం సింగరేణి అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం వల్ల విద్యుత్ అవసరాలు పెరిగిన నేపథ్యంలో సింగరేణి డిమాండ్‌కు తగ్గట్టుగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సూచించారు. సింగరేణి కేవలం బొగ్గు మైనింగ్‌కే కాకుండా అన్ని రకాల మైనింగ్‌లోకి ప్రవేశించాలని చెప్పారు. ఇందుకు ప్రజాప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు.

రానున్న కాలంలో వెనిడీయం, టైటానియం వంటి ఖనిజాల బ్లాక్‌లు వేలంలోకి వస్తున్న తరుణంలో వాటిని దక్కించుకునేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన భద్రత విషయంలో సింగరేణి తన పాత్రను మరింతగా పోషించాలని చెప్పారు. ప్రపంచ మార్పులకు అనుగుణంగా కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల మైనింగ్‌వైపు సింగరేణిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

అంతర్జాతీయ అవకాశాలను అధ్యయనం చేసేందుకు సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చిలీ వంటి దేశాల కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించామని చెప్పారు. సమీక్షలో సింగరేణి సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతి, డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.