14 August, 2026 | 4:12 AM

కొత్తగూడెం కార్పొరేషన్ ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’కు అర్హత సాధించిపెట్టా

14-08-2026 12:00 AM
  1. డీపీఆర్ టెండర్లలో పూర్తి పారదర్శకత పాటిస్తాం
  2. విమర్శల నివృత్తికే ఆన్‌లైన్ టెండర్లకు ఆదేశం
  3. రూ.9.60 కోట్ల అవినీతి ప్రచారం అబద్ధం
  4. అది నీతి అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు
  5. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం టౌన్ , ఆగస్టు 13, (విజయక్రాంతి): అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నిధులు వెచ్చించి పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఆయా పనులకు సంబంధించిన డిపిఆర్ తయారీ టెండర్లలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిధులు మంజూరు కానున్నాయని, పనుల అంచనాల ప్రకారమే కేంద్ర గ్రాంట్లు, రాష్ట్ర వాటా , బ్యాంకుల రుణాల ద్వారా నిధుల సమీకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా లక్ష కోట్ల కేంద్ర సహాయంతోపాటు 25 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం, 50 శాతం బ్యాంకు రుణం ఉంటుందని, ఇందులో భాగమైన 26 మున్సిపాలిటీల్లో ఖమ్మం కార్పొరేషన్కు రూ.2,670 కోట్ల రుణం వస్తుండగా, కొత్తగూడెం కార్పొరేషన్కు రూ.600 కోట్ల రుణం అడిగామని వివరించారు.

అభివృద్ధి పనుల నిధులపై కాకుండా కేవలం ’వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక టెండర్’కు సంబంధించి కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని మండిపడ్డారు. రూ.600 కోట్ల అంచనా పనులకు 1.6 శాతం చొప్పున డిపిఆర్ టెండర్ ఒప్పందం కుదిరితే, అందులో ఏకంగా రూ.9.60 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో నల్గొండలో 1.6 శాతం, మహబూబ్నగర్లో రూ.1,000 కోట్ల పనులకు 1.5 శాతంతో ఇలాగే డిపిఆర్ ఒప్పందాలు కుదిరాయని గుర్తుచేశారు.

ఇతర పట్టణాలు, మున్సిపాలిటీల్లోనూ ఇదే విధానంలో టెండర్లు జారీ అయినప్పుడు లేని అవినీతి కేవలం కొత్తగూడెంలోనే ఎలా జరుగుతుందని, అక్కడ కూడా అవినీతి జరిగినట్లేనా అని నిలదీశారు. ఆరు నెలల పసిపిల్ల లాంటి కొత్తగూడెం కార్పొరేషన్ను పురిటిలోనే చంపాలని కుట్రలు చేస్తున్నారని, అసలు నిధులే విడుదల కాకుండా డిపిఆర్ ఫీజులో కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు.

కొందరు పనిగట్టుకొని ప్రజల్లో అపోహలు సృష్టించారని, ప్రజల్లో ఉన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేయడానికి ఆఫ్లైన్ డిపిఆర్ విధానాన్ని రద్దు చేసి ఆన్లైన్ టెండర్లకు ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. డిపిఆర్ శాతాన్ని 0.5 శాతానికి లేదా మరింత తగ్గించే సామర్థ్యం ఉన్నవారు ఆన్లైన్ టెండర్లలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. చుంచుపల్లి ఉమ్మడి పంచాయతీ 45 ఏళ్లుగా సీపీఐ అధీనంలోనే ఉందని, ప్రజాదరణ లేకపోతే తాము ఎన్నికల్లో గెలుస్తామా అని ప్రశ్నించారు.

గతంలో ప్రపంచ బ్యాంకు రుణం (టీఎండీపీ) విధానాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు లేదా అధికారులు ఎవరైనా తప్పులకు పాల్పడినా, పేదలను మోసం చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని, అనవసర ఆరోపణలు చేస్తే వెంటాడతామని హెచ్చరించారు. 

పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన వివరించారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సిపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య  పాల్గొన్నారు.