జ్యువెలరీ షాపుల యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించాలి
- సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
- పాత ఉద్యోగులపై నిఘా ఉంచాలి
- సీపీ రష్మి పెరుమాళ్
సిద్దిపేట క్రైం, మే 20 : సిద్దిపేట పట్టణంలోని జ్యువెలరీ షాపుల యజమానులు, సిబ్బంది భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో సీపీ రష్మి పెరుమాళ్ జ్యువెలరీ షాపుల్లో తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 పై అవగాహన కల్పించారు.
ప్రతి వ్యాపార సంస్థ చట్టం ప్రకారం భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. జ్యువెలరీ షాపుల ప్రవేశ ద్వారం, వెళ్ళే ద్వారం స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, కనీసం 60 రోజుల బ్యాకప్ కలిగి ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ సెటప్ రహస్య ప్రదేశంలో ఉంచాలన్నారు. ప్రతి జ్యువెలరీ షాప్ ముందు తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, షాపుల వద్ద డోర్ ఫ్రేమ్, హ్యాండ్ హెల్ మెటల్ డిటెక్టర్ పరికరాలతో కస్టమర్లను తనిఖీ చేయాలని సూచించారు.
భవనం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా తగినన్ని సీసీ కెమెరాలను అమర్చాలని చెప్పారు. షాపుల యజమానులు తమ సంస్థలలో క్రమం తప్పకుండా సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి జ్యువెలరీ షాపులోనూ అడ్వానస్డ్ డిజిటల్ అలారం సిస్టమ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాత ఉద్యోగుల కదలికలపై యజమానులు నిఘా ఉంచాలన్నారు. షాపుల్లో ఎలాంటి అవాంఛనీయ లేదా అనుమానాస్పద సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
డయల్ 100, స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్లను షాపులో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించుకోవాలని సీపీ సూచించారు. షాపులలో అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. అంతేకాకుండా, షాపుల్లో దొంగతనాలు లేదా దోపిడీ యత్నాలు జరిగినప్పుడు నిందితులను ప్రతిఘటించేందుకు వీలుగా సిబ్బందికి పెప్పర్ స్ప్రే అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, అదనపు డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు , ఇన్స్పెక్టర్లు, సిద్దిపేట పట్టణ జ్యువెలరీ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.






