25 March, 2026 | 2:33 AM

వాళ్లకు ఆ చిత్రాల్లా నాకు దీవాన!

25-03-2026 12:00 AM

‘శుభం’ ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అందమైన ప్రేమకథగా దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో విడుదల కానున్న ఈ సినిమా నుంచి ‘ఇది ప్రేమ’ పాటను స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

అనంతరం ఈవెంట్‌కు అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “దీవాన మూవీ కంటెంట్ చాలా బాగుంది. హర్షిత్, స్మేహ బాగా పర్‌ఫార్మ్ చేశారు” అన్నారు. మరో అతిథి డైరెక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ.. “గతంలోలాగా సెలబ్రేషన్స్‌ను ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి తీసుకురావాలి” అన్నారు. ఇంకో అతిథి డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ.. “ఫస్ట్ లవ్‌కు, ఫస్ట్ సినిమాకు పెద్ద తేడా ఉండదు. మీ ప్రేమంతా ఈ సినిమాలో కనిపించింది” అన్నారు.

చిత్ర కథానాయకుడు హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఈ కథ విన్న తర్వాత వారం రోజుల దాకా అదే ఆలోచనలో ఉండిపోయా. నేను షారుఖ్ ఖాన్ అభిమానిని. ఆయన తొలిచిత్రం పేరూ ‘దివానా’నే అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్ అవుతుందనిపించింది. కమల్‌హాసన్‌కు సద్మా, నాగార్జునకు గీతాంజలి, పవన్‌కు తొలిప్రేమ, విజయ్ దేవరకొండకు అర్జున్‌రెడ్డిలాగా నాకు ‘దీవాన’ అలా పేరు తెస్తుంది” అన్నారు.

హీరో యిన్ స్మేహ మణిమేగలై మాట్లాడుతూ.. “దీవాన మీ మనసుల్ని తాకే ప్రేమ కథ. ఈ చిత్రంలో నేను అమ్ము అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నా. ఇలాంటి సందర్భం కోసం కలగన్నా. ఈ వేదిక మీద నిల్చుని మాట్లాడటం నమ్మలేకపోతున్నా” అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ.. “ఈ సినిమా చూశాక ఈ పాయింట్‌ను స్క్రీన్‌ప్లే చేసి సినిమాగా చూపించవచ్చా అనుకుంటారు” అన్నారు.

‘డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో ప్రతిభావంతంగా మూవీని రూపొందించాడ’ని నిర్మాత శ్రీదేవి చెప్పారు. నిర్మాత వాసుదేవ్ మాట్లాడుతూ.. “ఇంతకాలంగా ధైర్యం చాలక ప్రొడక్షన్‌లోకి రాలేదు. కానీ ఈ కథ వింటే చాలా ధైర్యంగా అనిపించింది” అని తెలిపారు. ‘దీవాన మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా అందరినీ ఆకట్టుకుంటుంద’ని మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ చెప్పారు.